వైసీపీ తరఫున పోటీ చేస్తున్న 25 మంది ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే…కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా సాధిస్తానని 2019 ఎన్నికల ప్రచారంలో నాటి ప్రతిపక్ష నేత జగన్ స్పీకర్లు దద్దరిల్లేలా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే…జగన్ మాటలు నమ్మిన జనం…వైసీపీ నుంచి 22 మంది ఎంపీలను గెలిపించారు. ఆ ఎంపీలు గెలిచి రెండున్నరేళ్లవుతున్నా…హోదా రావడం మాట దేవుడెరుగు..కనీసం హోదా కోసం తీవ్రంగా పోరాడిన, కేంద్రాన్ని నిలదీసిన సందర్భమే లేదు.
ఇక, హోదా విషయాన్ని ప్రతి పార్లమెంటు సమావేశంలో లేవనెత్తుతున్న టీడీపీ ఎంపీలు…తాజాగా శీతాకాల సమావేశాల్లోనూ ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ని ప్రశ్నించారు. అయితే, ఏపీకి హోదా అనేది ముగిసిపోయిన అంశమని కేంద్ర ప్రభుత్వం తరఫున నిత్యానంద రాయ్ మరోసారి తేల్చిచెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసులతో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిందని కేంద్రం స్పష్టం చేసింది.
ఏపీకే కాదు మరే రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అంగీకరించవని కేంద్రం గతంలో పలుమార్లు చెప్పింది. ఈ క్రమంలోనే హోదా వ్యవహారంపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్ కు ప్రత్యేక హోదా అంశాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పరిశీలిస్తున్నారని మీడియాలో వార్తలు వస్తున్నట్లు వెల్లడించారు. హోదా కల్పించడానికి 14వ ఆర్థిక సంఘం అడ్డంకి కాదనే వాస్తవాన్ని ఈ విషయం నిరూపిస్తోందని తెలిపారు. ఈ అంశంపై సీఎం జగన్, అన్ని పార్టీల నేతలు వెంటనే దృష్టి సారించాలని సూచించారు.
బీహార్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని నీతిఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ కు బీహార్ సీఎం నితీశ్ కుమార్ లేఖ రాశారు. ఆ అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తామంటూ నితీశ్ కు రాజీవ్ కుమార్ జవాబిచ్చారు. దీంతో హోదా ఆశిస్తున్న ఏపీవంటి ఇతర రాష్ట్రాల్లోనూ కలకలం మొదలైంది. ఈ క్రమంలోనే లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయినా, జగన్ ఈ విషయంపై స్పందించాలంటూ లక్ష్మీనారాయణ చెప్పే దాకా జగన్ సైలెంట్ గా ఉన్నారంటే హోదాపై ఆయనకున్న చిత్తశుద్ధి ఏంటో ఇట్టే అర్థమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి.