ఏపీ సీఎం జగన్ ప్రతి శుక్రవారం నాడు సీబీఐ కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే, సీఎం హోదాలో బిజీగా ఉన్న జగన్ వారం వారం హాజరు కాలేరంటూ హైకోర్టులో జగన్ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాబట్టి ఆ తీర్పు వచ్చేదాకా అయినా జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కావాలి. కానీ, జగన్ మాత్రం హాజరు కావడం లేదు.
ఈ క్రమంలోనే తాజాగా సీబీఐ కోర్టుకు హాజరు మినహాయింపు కోరుతూ జగన్ తరుపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సీబీఐ కోర్టు…జగన్ పై అసహనం వ్యక్తం చేసింది. ప్రతి విచారణకు మినహాయింపు కోరుతున్నారని, విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించింది. అయితే, హాజరు మినహాయింపుపై హైకోర్టును ఆశ్రయించామని, త్వరలోనే తీర్పు రానుందని జగన్ తరఫు న్యాయవాది తెలిపారు. అయితే, మెమో రూపంలో ఈ వివరాలను సమర్పించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. సీబీఐ కోర్టు ఆదేశాలతో తాజాగా జగన్ తరఫు లాయర్ మెమో దాఖలు చేశారు.
మామూలుగా అయితే ఎవరైనా విచారణకు హాజరు కాకుండా మినహాయింపు వస్తే హాజరు కాకుండా ఉంటారు. కానీ, కోర్టులో పిటిషన్ విచారణలో ఉంది కాబట్టి తాము హాజరుకావడం లేదని చెప్పరు. కానీ, జగన్ మాత్రం సరిగ్గా ఇలాగే మెమో దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ కోర్టులో విచారణ శుక్రవారం మాత్రమే జరిగేది. కానీ, ప్రజాప్రతినిధుల కేసుల విచారణ వేగవంతం చేయడంలో భాగంగా రోజువారీ విచారణ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో, ప్రతి రోజు ఆయా కేసులను సీబీఐ కోర్టు విచారణ జరుపుతోంది.