పవర్ లో ఎవరున్నా సరే.. తాము టార్గెట్ చేసిన పనుల్ని సొంతం చేసుకోవటంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా సరే కాంట్రాక్టు పనులు పెద్ద ఎత్తున చేపట్టే టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో తాజాగా సదరు కంపెనీ మీద తీవ్ర ఆరోపణలు రావటం.. సీబీఐ ఎంట్రీ ఇచ్చి కేసు నమోదు చేయటం వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా నాగర్నార్ లోని ఎన్ఎండీసీ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి బిల్లుల జారీ విషయంలో అధికారులకు మేఘా సంస్థ తరఫున లంచం ఇచ్చినట్లుగా కంప్లైంట్ అందింది. దీనిపై పలువురు ఉద్యోగులు (ప్రస్తుతం వారిలో పలువురు రిటైర్ కావటం గమనార్హం) పదవీ విరమణ చేసి ఉన్నారు. తాజా ఆరోపణల నేపథ్యంలో నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు చెందిన ఎనిమిది మంది అధికారులతో పాటు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఆధ్వరంలో మెకాన్ లిమిటెడ్ కు చెందిన ఇద్దరిపైనా కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో మేఘా సంస్థపైనా నిందితులుగా పేర్కొంటూ.. సంస్థను 12వ స్థానంలో చేర్చారు. మేఘా సంస్థ తరఫున జీఎం సుభాష్ చంద్ర సంగ్రాస్.. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పైన కేసు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు. ఇంతకూ ఈ ప్రాజెక్టు ఏమిటీ అంటే.. ఇన్ టేక్ వెల్.. పంప్ హౌస్.. తాగునీటి శుద్ధి ప్లాంటు.. క్రాస్ కంట్రీ పైప్ లైన్ నిర్మాణ పనులతో పాటు ఐదేళ్ల నిర్వాహణ కోసం 2015లో రూ.314.5 కోట్ల విలువైన కాంట్రాక్టు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
కాంట్రాక్టులో భాగంగా 2018లో డిసెంబరు నాటికి 73 ఇన్వాయిస్ ల ద్వారా ఎంఈఐఎల్ కు రూ.174.41 కోట్లను చెల్లించారు. ఈ ఇన్వాయిస్ లను త్వరగా ప్రాసెస్ చేసి.. బిల్లులు త్వరగా రిలీజ్ అయ్యేందుకు సహకరించిన అధికారులకు రూ.73.85 లక్షల భారీ మొత్తాన్ని లంచంగా ఇచ్చారని చెబుతున్నారు. నిజానికి ఈ కేసును గత నెల 31న సీబీఐ నమోదు చేసినప్పటికీ.. దీనికి సంబంధించిన సమాచారం చాలా ఆలస్యంగా వెలుగు చూసినట్లుగా చెబుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా సంస్థ ఈ ఉదంతంపై ఎలా రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.