మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. అమాత్యుడు అంబటికి గుంటూరు జిల్లా కోర్టు షాకిచ్చింది. సంక్రాంతి డ్రా పేరుతో బలవంతంగా టికెట్లు అమ్మిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అంబటిపై కేసు నమోదైంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అంబటి డబ్బులు దండుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో, అంబటిపై కేసు నమోదు చేయాలంటూ జనసేన నేతలు కోరినా…పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు.
దీంతో, వెంకటేశ్వరరావు పిల్ ను మంగళవారం విచారణ జరిపిన కోర్టు.. మంత్రి రాంబాబుపై తక్షణమే కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో, అంబటికి షాక్ తగిలినట్లయింది. లక్కీ డ్రా పేరు చెప్పి అంబటి ఆధ్వర్యంలో టికెట్లను బలవంతంగా అంటగడుతున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ముందుగా వారు అంబటిపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా…పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు.
ఈ క్రమంలోనే వారు జిల్లా కోర్టును ఆశ్రయించి కేసు నమోదయ్యేలా చేశారు. కొద్ది రోజుల క్రితం కూడా అంబటి వేరే వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కొడుకు చనిపోయిన బాధితురాలికి ప్రభుత్వం నుంచి వచ్చిన నష్టపరిహారంలో అంబటి వాటా అడిగారని ఆరోపణలు వచ్చాయి. ఆ వ్యవహారం పెను దుమారం రేపింది. చివరకు మంత్రి ఆ డబ్బులలో కూడా వాటా అడగడం ఏమిటని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. ఆ వ్యవహారం సద్దుమణగకముందే అంబటి మరో వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశమైంది.