తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పర్యటించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు రోడ్ షోకు అనుమతి లేదని పోలీసులు తమ బస్ అడ్డుపెట్టి మరి రోడ్ షో నిలిపివేసిన వైనం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబుపై తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించారన్న ఆరోపణలతో కేసు నమోదైంది.
అంతేకాకుండా, తమను దూషించారంటూ డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబుతో పాటు మరో ఏడుగురు టీడీపీ నేతలపై కేసు నమోదు అయింది. సెక్షన్ 143, 353, 149, 188ల ప్రకారం కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు, అనపర్తి రోడ్ షో సందర్భంగా గాయపడిన టీడీపీ నేతలను చంద్రబాబు పరామర్శించారు. పోలీసుల దాడిలో గాయపడ్డ పార్టీ కార్యకర్తలపే చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు.
వారికి టీడీపీ అండగా ఉంటుందని, వారంతా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ అక్రమ కేసులపై న్యాయపోరాటం చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు…జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. జగ్గంపేట, పెద్దాపురంలో లేని ఆంక్షలు అనపర్తిలో మాత్రం ఎందుకు విధించారని ప్రశ్నించారు. ప్రతిపక్షాల సభలను అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని ఆయన విమర్శించారు.
చట్టవ్యతిరేకంగా పనిచేయాలంటూ పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. సజ్జల డైరెక్షన్లోనే కొందరు పోలీసులు ఈ తరహా అరాచకాలు సృష్టిస్తున్నారని, కావాలనే టిడిపి కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు. సక్రమంగా విధులు నిర్వహించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సహకరించొద్దని పోలీసులకు చంద్రబాబు సూచించారు.