సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి, దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ నాలుగున్నరేళ్లుగా నత్తనడకన సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలుపై బయట ఉన్నారు. ఇక, ఈ కేసు విచారణ అధికారి రాంసింగ్ పై కూడా గతంలో కొన్ని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసులో అనూహ్య పరిణామం జరిగింది. వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు.
వివేకా కేసులో తనను కొందరు బెదిరిస్తున్నారని ఆయన మాజీ పీఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. వివేకా హత్యలో కొందరు నేతల ప్రమేయం ఉందంటూ సాక్ష్యం చెప్పాలని సీబీఐ అధికారులు..ప్రత్యేకించి రాంసింగ్ ఒత్తిడి చేశారని తన పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. సునీత, రాజశేఖర్ రెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. తనకు పోలీసులు కూడా రక్షణ కల్పించలేదని, అందుకే కోర్టును ఆశ్రయించానని చెప్పారు.
ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై తాజాగా విచారణ జరిపిన పులివెందుల కోర్టు సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ లపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ ప్రకారం ఐపీసీ సెక్షన్ 156(3) కింద పులివెందుల కేసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం పై సునీత స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.