మంత్రి తలసాని కుమారుడు తలసాని సాయికిరణ్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఎట్టకేలకు కేసు నమోదైంది. ఖైరతాబాద్‌లో సదర్ ఉత్సవాల సందర్భంగా ఓ వ్యక్తి పాదంపై నుంచి సాయికిర్‌ణ్ కారు పోనిచ్చాడన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై తలసాని శ్రీనివాస్ , సాయికిరణ్ స్పందించాల్సి ఉంది.
ఖైరతాబాద్‌లో శుక్రవారం రాత్రి జరిగిన సదర్ ఉత్సవాలకు తలసాని సాయికిరణ్ యాదవ్ తన కారులో వెళ్లి హాజరయ్యారు. ఉత్సవంలో పాల్గొని తిరిగి ఇంటికి వెళుతున్నక్రమంలో అటుగా నడుచుకుంటూ వెళుతున్న తన పాదంపై నుంచి సాయికిరణ్ కారు వెళ్లిందని ఇందిరానగర్‌కు చెందిన సంతోష్ (32) అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రైల్వే గేటు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తన ఎడమ కాలు పైనుంచి కారు టైర్ వెళ్లిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అయితే, శుక్రవారం రాత్రి ఘటన జరగ్గా, ఆదివారం ఉదయానికి గానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో, ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మంత్రి కొడుకును కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. ఎట్టకేలకు విమర్శలు రావడంతో హైదరాబాద్ లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఉదయం సాయికిరణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు, టీఆర్ఎస్ యూత్ వింగ్ లో సాయికిరణ్ యాదవ్ యాక్టివ్‌గా ఉంటున్నారు. పార్టీ చేపట్టిన పలు కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. కొన్ని కార్యక్రమాలను సాయికిరణ్ నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసి బీజేపీ అభ్యర్థి అయిన కిషన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.