ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్ ల కాంబోలో వస్తోన్న ‘పుష్ప’చిత్రం ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. బన్నీకి జంటగా రష్మిక మందన్న నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఈ సినిమా పై ఆ అంచనాలను మరింత పెంచాయి. ఇక, లేట్ అయినా…లేటెస్ట్ గా రిలీజైన సమంత ఐటెం సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.
‘ఊ అంటావా మావా… ఊఊ అంటావా మావా…’ అంటూ సాగే ఈ మాస్ ఐటం సాంగ్ సోషల్ మీడియా, యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ప్రముఖ సింగర్ మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్ కు సమంత సిజ్లింగ్ లుక్ తోడవడంతో ఈ పాటకు కుర్రకారు ఫిదా అయింది. అయితే, అనూహ్యంగా ఈ పాట ఓ వివాదంలో చిక్కుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పాట పురుషులను కించపరిచేలా ఉందని ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం కోర్టులో కేసు వేసినట్లు సోషల్ మీడియాతోపాటు కొన్ని మీడియా చానెళ్లలో ప్రచారం జరుగుతోంది.
ఆడవాళ్లను మగవాళ్ళు కేవలం కామంతోనే చూస్తారన్న అర్థం వచ్చేలా ఆ పాట ఉందని, అది తమకు అభ్యంతరకరమని ఆ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ పాటను నిషేధించాలని ఆ సంఘం కోర్టును ఆశ్రయించిందని ప్రచారం జరుగుతోంది. ఆ పాట లిరిక్స్ మార్చాలని, లేదంటే ఆ పాటను నిషేధించాలని ఏపీ పురుషుల సంఘం డిమాండ్ చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వ్యవహారంపై అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఏపీలో అరాచకాలని అడ్డుకోవడానికి సాహసించని మగతనం…ఓ పాటపై పౌరుషం చూపుతోందా అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.