టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, లోకేష్ పాదయాత్రకు అనుమతులు నిరాకరించడం మొదలు పాదయాత్రలో అడ్డంకులు సృష్టించడం వరకు ఎన్నో రకాలుగా ఈ యువ గళాన్ని అడ్డుకునేందుకు వైసిపి నేతలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ఎన్ని అవాంతరాలు వచ్చినా పాదయాత్రను కొనసాగించాలన్న సంకల్పంతో లోకేష్ ముందుకు వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా నారా లోకేష్ తో పాటు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం రేపుతోంది. లోకేష్ తో పాటు అమర్నాథ్ రెడ్డి, దీపక్ రెడ్డి, పులివర్తి నాని తదితరులపై కేసు నమోదు అయింది. ఇక, టిడిపి నేతలు ఎస్పీ జయప్రకాష్, జగదీష్ లపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. లోకేష్ సహా పలువురిపై బంగారుపాళ్యం ఎస్సై మల్లికార్జున్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది.
ఇక, పలమనేరు అశోక్ కుమార్ ఫిర్యాదు ప్రకారం మిగతా టిడిపి నేతలపై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. శుక్రవారంనాడు బంగారు పాళ్యంలో బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు మూడు వాహనాలను సీజ్ చేశారు. అయితే, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, హత్యాయత్నానికి పాల్పడ్డారని టిడిపి నేతలపై ఈ కేసు నమోదు చేశారు. ఈ బంగారు పాళ్యం ఘటన నేపథ్యంలోనే లోకేష్ తదితరులపై కేసు నమోదు చేశారు.
అయితే, అధికార పార్టీతో కుమ్మక్కైన కొందరు పోలీసులు పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అవాంతరాలు సృష్టించిన పాదయాత్ర ఆగే ప్రసక్తే లేదని చెబుతున్నారు. బంగారుపాళ్యం సభను అడ్డుకోవాలనే పక్కా ప్రణాళికతో డీఎస్పీ తన పోలీస్ బలగంతో వచ్చి.. ఇక్కడ మీటింగ్ పెట్టవద్దని లోకేష్‌తో అన్నారని ఆరోపిస్తున్నారు. లోకేష్ వాహనం ఎక్కకుండా పక్కనున్న భవనంపైకి ఎక్కి ప్రసంగించారని, అయినా మూడు వాహనాలను సీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి…పోలీసులపై తాము కేసు పెడతామోనని భయపడి.. తిరిగి తమపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.