టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పాదయాత్రకు ఇప్పటికే రకరకాల అడ్డంకులు సృష్టించిన వైసీపీ నేతలు తాజాగా మరోసారి లోకేష్ పాదయాత్రపై విషం చిమ్మేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే నల్లజర్ల పోలీస్ స్టేషన్లో లోకేష్ తో పాటు కొంతమంది యువగళం సభ్యులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం సంచలనం రేపుతోంది. జగన్ ఫ్లెక్సీలను లోకేష్ చింపించారని వైసీపీ నేతలు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా, వైసీపీ నేతలపైకి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఉసిగొల్పుతున్నారని ఆ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే లోకేష్ ఇతర టీడీపీ నేతలు, కార్యకర్తలపై సెక్షన్ 341, పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, అన్యాయంగా లోకేష్ పై, టీడీపీ నేతలపై కేసు బనాయించడంపై టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. లోకేష్ పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఇటువంటి తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడుతున్నాయి. మరోవైపు, ఉంగుటూరు నియోజకవర్గం లోకేష్ పాదయాత్ర ప్రవేశించింది. ఈ క్రమంలోనే ఉంగుటూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో కార్యకర్తలు అభిమానులు ప్రజలు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జగన్ పై లోకేష్ మండిపడ్డారు. జగన్ పాలనలో కీలక పదవుల్లో ఎవరున్నారో ప్రజలు ఒకసారి గమనించాలని లోకేష్ అన్నారు. బీసీలు అంటే బలహీన వర్గాలు కాదని, బలమైన వర్గం అని లోకేష్ చెప్పారు. బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కట్ చేసిన జగన్ 16 వేల మందిని పదవులకు దూరం చేశాడని ఆరోపించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాతే బీసీలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్రం లభించిందని అన్నారు. బీసీలపై జగన్ 26 వేల అక్రమ కేసులు పెట్టించాడని, టీడీపీ లో బీసీ నాయకులను వేధించారని ఆరోపించారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల కోసం ప్రత్యేకంగా రక్షణ చట్టం తీసుకొస్తామని, న్యాయపోరాటానికయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను జగన్ పక్కదారి పట్టించారని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఖర్చును బీసీల ఖాతాలో జగన్ చూపించి మోసం చేస్తున్నారని అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 217 ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా జనం బుగ్గలు నిమిరి ముద్దులు పెట్టిన జగన్ ఎస్సీ లపై కపట ప్రేమ చూపించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులలో ఏపీ మొదటి స్థానంలో ఉందని విమర్శించారు.