వైసీపీ ప్రభుత్వంపై, వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పాలనపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ సోషల్ మీడియా విభాగం కార్యకర్తలపై వైసీపీ నేతలు కక్ష సాధిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకుగాను గతంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త, యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు వెంగళరావును సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం కొద్ది రోజుల క్రితం సంచలనం రేపింది.
అంతేకాదు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామను కస్టడీలో కొట్టిన తరహాలోనే పోలీసులు తననూ కొట్టారంటూ జడ్జిగారి ముందు స్వయంగా వెంగళరావు వాంగ్మూలం ఇవ్వడం, తన ఒంటిపై గాయాలను చూపించడం దుమారం రేపింది. ఆ వ్యవహారంలో పోలీసుల తీరుపై విమర్శలు వచ్చాయి. అయినా సరే, తాజాగా మరోసారి తెలుగు దేశం పార్టీ కార్యకర్త, ఐ టీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనూషపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది.
అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే, వైసీపీ నేత పద్మావతిపై సోషల్ మీడియాలో అసభ్యకర రీతిలో అనూష పోస్టులు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రకారం ఏలూరులో ఉన్న ఉండవల్లి అనూషకు అనంతపురం పోలీసులు 41 ఏ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. 3 రోజుల్లోగా ఎమ్మెల్యే పద్మావతిపై పెట్టిన పోస్టులపై వివరణ ఇవ్వాలని అనూషకు పోలీసులు హుకుం జారీ చేశారు. లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు.
అయితే, పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడంపై అనూష స్పందించారు. ఆ నోటీసుల్లో పేర్కొన్న సోషల్ మీడియా ఐడీలు తనవి కావని క్లారిటీనిచ్చారు. ఎవరో తప్పుడు ఫిర్యాదు చేస్తే అనంతపురం నుంచి పోలీసులు వచ్చి తనకు నోటీసులు ఇవ్వడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని ఫైర్ అయ్యారు. ఈ నోటీసులపై కోర్టును ఆశ్రయిస్తానని అనూష వెల్లడించారు.
అంతకుముందు, అనూషపై భీమిశెట్టి శ్రీనివాసులు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో శింగనమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా మంగళవారం ఆమెకు నోటీసులు జారీ చేశారు.