బ్రాండ్స్ కు ప్రముఖుల చేత ప్రచారం చేయించటం.. అందులో భాగంగా వారితో ఒప్పందాలు చేసుకోవటం తెలిసిందే.అయితే.. బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించే సందర్భంలో ముందువెనుకా చూసుకోకుంటే చిక్కులు తప్పవు. ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సతీమణి గౌరీఖాన్ తెలుసు కదా? ఇప్పుడామె కేసును ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో తాజాగా ఆమెపై పోలీసు కేసు నమోదైంది. ఇంతకీ ఆమె ఏం తప్పు చేశారు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. నేరుగా ఆమె తప్పు చేయలేదు కానీ.. ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశారు. ఇప్పుడు అదే ఆమెకు ఇబ్బందిగా మారింది.
ఇంతకూ జరిగిందేమంటే.. తుల్సియానీ బిల్డర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు గౌరీఖాన్. ఆమె చేసిన ప్రచారానికి ప్రభావితమై తుల్సియానీ బిల్డర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి 2015లో తాను రూ.85.46 లక్షలకు ఒక ప్లాట్ కొన్నానని.. దాన్ని 2016లో పూర్తి చేసి అప్పగించాల్సి ఉందని జస్వంత్ షా అనే వ్యక్తి వాదన. ప్లాట్ కొనుగోలుకు రూ.85.46 లక్షలు సంస్థకు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్లాట్ ను అప్పగించాల్సిన సమయానికి అప్పగించలేదు. దీంతో ముందుగా అనుకున్న దాని ప్రకారం 2017లో రూ.22.70 లక్షల పరిహారాన్ని ఇచ్చారు. మరో ఆరు నెలల్లో ప్లాట్ అప్పగించకపోతే మిగిలినసొమ్మును వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పారన్నారు.
చెప్పినట్లుగా ప్లాట్ ఇవ్వకపోవటం ఒక ఎత్తు అయితే.. ప్లాట్ అప్పగించని పక్షంలో చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉన్నా.. దాన్ని ఇవ్వలేదు. అంతేకాదు.. తనకు ఇవ్వాల్సిన ప్లాట్ ను వేరే వారికి అమ్మేందుకు వీలుగా ఒప్పందాన్ని చేసుకున్న వైనాన్ని గుర్తించిన బాధితుడు.. తాను ఈ ప్లాట్ కొనుగోలుకు ప్రచారకర్తగా ఉన్న గౌరీఖాన్ మాటలకు ప్రభావితమై తాను కొనుగోలు చేసినట్లుగా పేర్కొన్నారు. అతగాడి కంప్లైంట్ ను తీసుకున్న పోలీసులు ఆమెపైనా.. రియల్ ఎస్టేట్ సంస్థపైనా కంప్లైంట్ నమోదు చేసి.. కేసును విచారిస్తున్నారు. ప్రముఖుల తాము చేసుకునే ఒప్పందాలకు ముందు.. సదరు బ్రాండ్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్నది చెక్ చేసుకుంటే మంచిది. లేదంటే ఇలాంటి తిప్పలు తప్పవు.