వైసీపీ హయాంలో అధికార కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపిన వైసీపీ నేతలు.. ఇప్పుడు వరుస కేసులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు అంటూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా చేరారు. కాకాణికి కష్టకాలం మొదలైనట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో నిందితుడిగా కాకాణిని పేరు బలంగా వినిపిస్తోంది. ఇంతలోనే అక్రమ మైనింగ్ కేసులో ఆయన అడ్డంగా ఇరుక్కున్నారు. అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన వ్యవహారంలో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై తాజాగా నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలోని రుస్తుం మైన్స్‌లో క్వార్ట్జ్ అక్రమ రవాణా జరిగిందని.. నిబంధనలు ఉల్లంఘించి పేలుడు పదార్థాలు కూడా వినియోగించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. గత వైసీపీ హయాంలో లీజు ముగిసినా రూ.250 కోట్ల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తరలించారని.. దీని వెనుక అప్పటి మంత్రి కాకాణి హస్తం ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేంద్ర మైనింగ్ శాఖకు ఫిర్యాదు చేశారు.
కేంద్రం ఆదేశాలకు తోడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసులో కదలిక మొదలైంది. క్వార్ట్జ్ అక్రమాల వ్యవహారంలో ఇదివరకే ముగ్గురిపై కేసు పెట్టగా.. సోమవారం కాకాణితో సహా మరో ఏడుగురిపై జిల్లా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాకాణి పేరును ఏ4గా ఎఫ్ఐఆర్లో చేర్చాడు. కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడైన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఏ1 కాగా.. పార్టీ నేతలు వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డి ఏ2, ఏ3లుగా ఉన్నారు. వీరు ముగ్గురూ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు.
అయితే తాజాగా పోలీసులు ఏ6, ఏ8గా ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి గూడూరు కోర్టులో హాజరుపరచగా.. వారిని న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కాకాణితో సహా మిగిలిన నిందుతులను కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.