టాలీవుడ్ లో ‘శివ’తో విలక్షణ దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ ఓ సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. కాలగమనంలో వివాదాలనే ముడిసరుకుగా మార్చి సినిమాలు తీస్తూ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీగా మారారు. ఆ తర్వాత వైసీపీ సానుభూతిపరుడిగా మారిపోయిన వర్మ..వైసీపీకి అనుకూలంగా, జగన్ కు ఫేవర్ గా 2024 ఎన్నికలకు ముందు తెరకెక్కించిన వ్యూహం సినిమా తాజాగా ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది.
ఆ చిత్రం కాంట్రవర్షియల్ ప్రమోషన్ లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, నారా లోకేష్, నారా బ్రాహ్మణిలను కించపరిచేలా వర్మ పెట్టిన పోస్ట్ పై తాజాగా కేసు నమోదైంది. వర్మపై ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం కింద ఆర్జీవీపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్, లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణిలపై అనుచిత, అసభ్యర, అశ్లీల పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వర్మపై కూడా కేసు నమోదైంది. మరి, తనపై పెట్టిన కేసు విషయంలో వర్మ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.
కర్మ ఎవరనీ వదలదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే వర్మను వదలని కర్మ కేసు రూపంలో వెంటాడిందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.