అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉండే అమెరికా అధ్యక్షుడు బైడెన్ కాన్వాయ్ లోని ఒక కారును ఢీ కొట్టిన ఉదంతం షాకింగ్ గా మారింది. సాధారణంగా అమెరికా అధ్యక్షుడి భద్రతా ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉంటాయో తెలియంది కాదు. అలాంటిది ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని ఒక వాహనాన్ని ఢీ కొట్టటం ఇప్పుడు సంచలనంగా మారింది. వాషింగ్టన్లోని బిడెన్-హ్యారీస్ 2024 ప్రచార కార్యాలయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఉదంతం చోటుచేసుకుంది.
ఆదివారం వాషింగ్టన్ లోని డెలావేర్ లోని ఎన్నికల క్యాంపెయిన్ ఆఫీసు నుంచి బయలుదేరి వెళుతున్న వేళలో.. కాన్వాయ్ లోని ఒక భద్రతా వాహనాన్ని ఒక కారులో వచ్చి ఢీకొనటంతో కొన్ని క్షణాలపై అసలేం జరిగిందో అర్థం కాని పరిస్థితి. ఆదివారం రాత్రి 8.07 గంటల వేళలో ఈ ఉదంతం జరిగింది. ఎన్నికల క్యాంపెయిన్ ఆఫీసుకు ఎదురుగా ఉండే రోడ్డు కూడలి వద్ద ఈ ఉదంతం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ కు రక్షణ కవచంగా ఉండే ఎస్ యూవీ వాహనాన్ని సెడాన్ కారు వచ్చి ఢీ కొట్టింది. మరో వాహనంపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేసింది.
ఈ ప్రమాదం జిల్ బైడెన్ కూర్చున్న వాహనానికి.. అత్యంత సమీపంలో ఉన్నట్లు చెబుతున్నారు. బైడెన్ కు కేవలం 130 అడుగుల దూరంలో ఈ ఘటన జరగటం షాకింగ్ గా మారింది. దీంతో.. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తక్షణమే స్పందించి.. వెంటనే బైడెన్ దంపతులు ఉన్న వాహనానికి రక్షణ కవచంలా నిలిచారు. అంతేకాదు.. ప్రమాదానికి కారణమైన కారును సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు చుట్టు ముట్టారు. ఆయుధాలతో గురి పెట్టారు. కారులోని వ్యక్తికి గన్స్ ను గురి పెట్టారు. దీంతో.. అతను లొంగిపోతున్నట్లుగా చేతులు పైకి ఎత్తినట్లుగా తెలుస్తోంది. ఈ ఉదంతం అనంతరం బైడెన్ దంపతుల్ని తక్షణమే అక్కడి నుంచి వేగంగా తరలించారు. దగ్గర్లోని విల్మింగ్టన్ లోని ఇంటికి చేర్చి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
అనంతరం వైట్ హౌస్ కు తరలించినట్లుగా చెబుతున్నారు. అధ్యక్షుల వారు.. ప్రథమ మహిళ సురక్షితంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ ఉదంతం ఎలా చోటు చేసుకుంది. ఢీ కొట్టిన వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అసలు అధ్యక్షుల వారి కాన్వాయ్ లోని వాహనాన్ని ఢీ కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.