ప్రముఖ సినీ నటుడు కమ్ డీఎండీకే అధినేత విజయకాంత్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్యం ఏ మాత్రం బాగోవటం లేదు. దీంతో చికిత్స తీసుకుంటున్న ఆయన.. ఆ మధ్యన కరోనా బారిన పడటం తెలిసిందే. దీని నుంచి కోలుకున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం సరిగా లేదన్న మాట వినిపిస్తోంది. వైద్యుల సూచన మేరకు వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉంటున్న ఆయన.. అక్కడి నుంచి పార్టీ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా.. సరిగ్గా ఎన్నికల వేళలో అధినేతలు పూర్తిస్థాయిలో యాక్టివ్ గా ఉండటమే కాదు.. అలుపెరగని రీతిలోశ్రమించాల్సి ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంటుంది.
అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న విజయ్ కాంత్..మిగిలిన వారి మాదిరి చురుకుగా వ్యవహరించలేకపోతున్నారు. దీనికి తోడు.. పార్టీ నేతలతో సమావేశానికి సైతం హాజరు కావటం లేదు. పార్టీని కెప్టెన్ సతీమణి.. బావమరిది సుధేష్ ఇద్దరూ చూసుకుంటున్నారు. అధినేత రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్టీ వర్గాలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తే ఘటన తాజాగా చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఉన్నట్లుండి ఇంటి నుంచి కారులో బయలుదేరిన విజయకాంత్.. నేరుగా నందంబాక్కంలోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లటంతో పార్టీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఆయనకేమైందో అన్న ఆందోళన వ్యక్తమైంది. అయితే.. ఆసుపత్రిలో ఎక్కువసేపు ఉండని విజయ్ కాంత్ వెంటనే తిరిగి వచ్చారు. వైద్య పరీక్షలు చేయించుకొని వచ్చారు. ఇంటి నుంచి బయటకు రావటంతో అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాటు కోసం వెళుతున్నట్లుగా భావించినప్పటికీ.. అందుకు భిన్నంగా ఆసుపత్రికి వెళ్లటంతో నేతలు అయోమయానికి గురవుతున్నారు. కీలకమైన ఎన్నికల వేళ.. అధినేత ఆరోగ్యం సరిగా లేకపోవటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో కెప్టెన్ పార్టీ నేతలు ఉన్నారు.