జగన్ 16 నెలలు జైల్లో ఉన్నా ఆయనలో మార్పు రాలేదని కాంగ్రెస్ నేత చింతా మోహన్ జగన్ పై విమర్శలు చేశారు. జగన్ పరిపాలన మొత్తం ఓటు చుట్టూ తిరుగుతుంది గాని ప్రజల భవిష్యత్తును పట్టించుకోవడం లేదన్నారు.
తన క్రిమినల్ ఆలోచనలతో ఏపీ అభివృద్ధిని ఆపేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాల్సిందేనని చింతా మోహన్ డిమాండ్ చేశారు. కోర్టు బెయిల్ షరతులను మొత్తం జగన్ ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు.
తన అవినీతి ఆరోపణల కేసుల్లో నిందితులుగా ఉన్న శ్రీలక్ష్మి సహా పలువురు ఐఏఎస్ అధికారులకు జగన్ కీలక పోస్టులు ఇవ్వడం, తన కేసుల్లో ఉన్న నాయకులకు, పారిశ్రామిక వేత్తలకు పదవులు ఇవ్వడం ద్వారా జగన్ తన కేసుల్లో సాక్షులను భయబ్రాంతులను చేశారని చింతా మోహన్ అన్నారు.
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం చెప్పగలరా? బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘిస్తుంటే కోర్టులు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు అని చింతా మోహన్ ప్రశ్నించారు. కోర్టులకు కళ్లు లేవా? అని నిలదీశారు.
ఇలాంటి నేరస్థుల విషయంలో ఉదాసీనంగా ఉండటం వల్ల ప్రజల్లో న్యాయస్థానాల చిత్తశుద్ధిపై అనుమానం కలుగుతోందన్నారు. లక్ష రూపాయల అవినీతికి దళిత నేత బంగారు లక్ష్మణ్ ను జైలుకు పంపిన కోర్టులు వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్న జగన్ విషయంలో ఇంత ఉదాసీనంగా ఎలా ఉన్నాయని చింతా మోహన్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
కోర్టులు కళ్లు మూసుకున్నాయా? జగన్ కు ఒక న్యాయం, దళితుడైనా బంగారు లక్ష్మణ్ కు మరో న్యాయమా? అని అసహనం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లతో తిరుపతి పోలింగ్ నిర్వహించిన ఈసీ కూడా కళ్లు మూసుకుందని బంగారు లక్ష్మణ్ అన్నారు. పోలింగ్ రోజున దొంగ ఓట్లు వేసిన వారంతా కరోనాకు గురై ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని చెప్పారు.