వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు సొంత సోదరి షర్మిల నుంచి భారీ సెగ తగులుతోంది. తాజాగా ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు జగన్ ఆయన ఎమ్మెల్యేల బృందం వచ్చినట్టే వచ్చి.. కొద్దిసేపు ఉండి.. వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. “11 మంది వచ్చి.. 11 నిమిషాలు ఉండి వెళ్లేందుకేనా? అసెంబ్లీకి వచ్చింది?“ అని ఆమె నిలదీశారు. ఈ మాత్రానికే అంత హడావుడా అని పెదవి విరిచారు.
అంతేకాదు.. వైసీపీ కోరిన ప్రధాన ప్రతిపక్షం డిమాండ్‌పైనా షర్మిల మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు ప్రతిపక్ష హోదా అవసరమా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిం చేందుకు ప్రతిపక్ష హోదా ఉండాలా? అప్పుడు గానీ మీరు ప్రజల తరఫున ప్రశ్నించలేరా? అని నిలదీ సింది. కేవలం పదవీ కాంక్షతోనే ప్రధాన ప్రతిపక్షం కోరుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు, వారి సమస్యలు పట్టించుకునే వారైతే..ఎలాంటి ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ లేకుండానే సమస్యలపై స్పందించేవారని అన్నారు.
ప్రజా సమస్యలపై స్పందించాలని ఉన్నా.. ప్రజల కోసం పనిచేయాలని ఉన్నా.. మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్లాలని షర్మిల తేల్చి చెప్పారు. లేకపోతే.. 11 మంది తమ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ మంగళవారం నుంచి సభకు వెళ్లని పక్షంలో మీ సభ్యత్వాలురద్దు అవుతాయన్న భయంతోనే తొలిరోజు సభకు వచ్చారని అనుకోవాల్సి ఉంటుందని షర్మిల తేల్చి చెప్పారు. సభ్యత్వం ఎలా ఉన్నా సమస్యల కోసం సభకు వెల్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.