నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు చేతిలో మొబైల్ ఎంత ముఖ్యమో.. అందులో వాట్సాప్ అంతే ముఖ్యంగా మారింది. వాట్సాప్ ఒక గంట పని చేయకపోతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాట్సాప్ మాదిరి ఉండే ‘‘సందేశ్’’ పేరుతో సరికొత్త యాప్ ను దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం కోసం మోడీ సర్కారు కసరత్తు చేస్తోంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ స్వదేశీ యాప్..ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగిస్తున్నారు.
గూగుల్ ప్లే స్టోర్ లో కనిపించని ఈ యాప్.. డూప్లికేట్ యాప్ లు ఇదే పేరుతో కాస్త స్పెల్లింగ్ తేడాతో అందుబాటులో ఉన్నాయి. సమాచార మార్పిడి కోసం వినియోగించే వాట్సాప్ తో వస్తున్న ఇబ్బందుల్ని గుర్తించిన కేంద్రం.. ఇప్పుడు సాదారణ ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న ఆలోచనలో ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో జరుగుతున్న రైతు ఉద్యమాల నేపథ్యంలో అంతర్జాతీయ సెలబ్రిటీలు స్పందించటం.. వారు చేసే వ్యాఖ్యలకు అధిక ప్రాధాన్యత లభించటంతో.. మోడీ సర్కారు కొత్త తలనొప్పుల్ని ఎదుర్కొంటోంది.
అంతర్జాతీయ సెలబ్రిటీలకు ధీటుగా దేశీ సెలబ్రిటీలు మోడీ సర్కారుకు మద్దతు పలికేలా చేస్తున్న వ్యాఖ్యలు.. వ్యూహాత్మకన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. ఎఫ్ డీఐల విషయంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఎఫ్ డీఐకు తాజాగా మోడీ మాట్లాడుతూ.. ఫారెన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీగా అభివర్ణించారు. స్వతంత్రంగా.. స్వేచ్ఛగా ఏ సమాచారాన్ని అయినా సరే తమ సామాజిక మాథ్యమాల్లో పంచుకునే వీలు కల్పిస్తున్న ఫేస్ బుక్.. ట్విటర్.. ఇన్ స్టా.. వాట్సాప్ లాంటి విదేశీ యాప్ లపైన కేంద్రం నియంత్రణ కోరుకుంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఇందులో భాగంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డెవలప్ చేసిన సందేశ్ ను వాట్సాప్ మాదిరి వినియోగించే వీలుంది. అయితే.. దీనితో వచ్చే సమస్య ఏమంటే.. ప్రభుత్వం ఏదైనా అంశాన్ని నియంత్రించాలంటే ఇట్టే నియంత్రించే వీలుంది. ఫేస్ బుక్.. ట్విటర్.. వాట్సాప్ లలో అంత తేలిక కాదు. పలు అంశాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతే నియంత్రణకు సదరు సంస్థలు ఒప్పుకుంటాయి. సమాచారాన్ని స్వేచ్ఛగా ప్రసారం కావాలి. భిన్న వాదనలు చర్చకు రావాలన్న ప్రజాస్వామ్య భావనలు.. ప్రభుత్వ నియంత్రణలో సాగే సందేశ్ తో సాధ్యమా? అన్నది ప్రశ్న. ఏమైనా.. వాట్సాప్ కు బదులుగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్న సందేశ్ కు ఎంతటి ఆదరణ లభిస్తుందో చూడాలి.