ఈ ఏడాది నవంబరు 5న జరగనున్న అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలకు సంబంధించి ప్రజల మూడ్ మారినట్టు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఎన్నికల్లో ముందంజలో కొనసాగిన రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. తాజాగా వెనుకబడ్డారు. నిజానికి రెండు వారాల కిందట ట్రంప్‌పై హత్యాయత్నం జరగడానికి ముందు కూడా.. ట్రంప్ దూకుడుగానే ఉన్నారు. ఇక, హత్యా యత్నం తర్వాత.. ట్రంప్ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగిపోయింది. విరాళాలు కూడా ఉవ్వెత్తున తరలి వచ్చాయి. ట్విట్టర్ దిగ్గజం.. మస్కే నెలకు 47 మిలియన్ల మేర విరాళం ఇవ్వనున్నట్టు తెలిపారు.
ఇలా దూసుకుపోతున్న సమయంలో అధికార డెమొక్రాట్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న మొన్నటి వరకు అధ్యక్ష రేసు లో ఉన్న ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్.. పేలవమైన పోటీ ఇస్తుండడం.. తీవ్ర అనారోగ్య సమస్య ఎదుర్కొంటుండడంతో ట్రంప్ దూకుడు పెరిగినట్టు గుర్తించారు. మొత్తానికి బైడెన్‌ను ఏదో విధంగా ఒప్పించి రెండు రోజుల కిందట ఆయన పోటీ నుంచి తప్పుకొనేలా చేశారు. ఆ వెంటనే ఆయన డిప్యూటీ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌ను తన వారసురాలిగా ప్రకటిస్తే.. మద్దతిస్తానని కూడా చెప్పారు. దీనికి ఇంకా డెమొక్రాట్లు అంగీకరించలేదు. అయితే.. ప్రస్తుతం మాత్రం ఆ పార్టీ తరఫున కమల ప్రచారం చేస్తున్నారు.
ఆమె పోటీలో ఉన్నారని తెలియడంతో డెమొక్రాట్లకు ఎన్నికల విరాళాల వరద పారడం ప్రారంభమైంది. ఇక, ప్రవాసులు కూడా ఆమెకు మద్దతిస్తున్నారు. స్థానికంగా ఉన్న `నెట్‌ఫ్లిక్స్` ఆమెకు మద్దతు ఇచ్చే ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. అయినా తాము వెనక్కి తగ్గబోమని ఆ సంస్థ ప్రకటించుకుంది. ఇదిలావుంటే.. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ `వాల్ స్ట్రీట్ జర్నల్` నిర్వహించిన ముందస్తు ఎన్నికల సర్వేలో కమలకు అనూహ్యమైన మద్దతు లభించిందని పేర్కొంది. ఆ వివరాల ప్రకారం.. ట్రంప్‌కు 47 శాతం మంది ప్రజల మద్దతు ఉంటే.. కమలా హ్యారీస్‌ను అధ్యక్షురాలిగా కొరుకుంటున్నవారు 49 శాతం మంది ఉన్నారని స్పష్టమైంది.
ముఖ్యంగా అమెరికాయేతర పౌరులు కమలకు జై కొడుతుండడం గమనార్హం. ఇక, కమల వ్యక్తిగత వివరాలు చూస్తే.. ఆమె భారతీయ పౌరురాలు శ్యామలా గోపాలన్‌కు, దక్షిణాఫ్రికాకు చెందిన పౌరుడు డొనాల్డ్ జె హ్యారిస్‌కు జన్మించుకున్నారు. అసలు పేరు కమలాదేవి. 59 ఏళ్ల కమలకు అటు భారత సంతతి పౌరులు సహా దక్షిణాఫ్రికా సంతతి పౌరులు కూడా అమెరికాలో మద్దతిస్తుండడం గమనార్హం. దీంతో నే ఆమెకు మద్దతు పెరుగుతోంది. ఇక, ట్రంప్ ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “కమల జిత్తుల మారి. ఆమెను నమ్మొద్దు“ అని అమెరికన్లకు ఆయన పిలుపునిచ్చారు.