పరుచూరు నియోజకవర్గంలో వైసీపీ మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ నిన్నటి వరకు వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న ఆమంచి కృష్ణ మోహన్‌ను తప్పించి.. ఆయన ప్లేస్‌లో ఎన్నారై.. యెడం బాలాజీని తీసుకువచ్చారు. ఆయన వచ్చీ రావడంతోనే పరుచూరు నియోజకవర్గం బాధ్యతలను అప్పగించారు. అయితే.. వైసీపీకి యెడం కొత్తకాదు. గత 2014 ఎన్నికల్లో చీరాల నుంచి ఈయన పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన మూడో ప్లేస్‌తో సరిపెట్టుకున్నారు.
ఆ తర్వాత ఆయనకు 2019 ఎన్నికల్లో వైసీపీ సీటు ఇవ్వకపోవడంతో టీడీపీ కండువా కప్పుకుని ఆ పార్టీ నుంచి కూడా చీరాలలో కొద్ది నెలల పాటు ఇన్చార్జ్గా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పి తిరిగి విదేశాలకు చెక్కేశారు. అసలు ఇప్పటి వరకు బాలాజీకి ఇటు జిల్లా ప్రజలతో సంబంధం లేదు… ఆయన హ్యాపీగా విదేశాల్లో తన పనేదో తాను చేసుకుంటున్నారు. జగన్ పరుచూరులో ఎవ్వరూ గతిలేక సడెన్‌గా ఇప్పుడు ఆయనను తెచ్చి.. పరుచూరు నియోజకవర్గం ఇంచార్జ్‌ను చేశారు.
వాస్తవానికి ఆయన ఇక్కడ కొత్త. పైగా పరుచూరు బోర్డర్ ఎక్కడి వరకో కూడా తెలియని వ్యక్తి. ఇదే విషయం ఇక్కడి ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఇక్కడ సమస్యలు, ఇక్కడి రైతుల సాధక, బాధకాలు.. చివరకు వైసీపీ కేడర్ కూడా ఎవరెవరో తెలియని దుస్థితి. ఈ విషయం వైసీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. ఇవే ప్రశ్నలు ఇప్పుడు సీఎం జగన్ సహా.. యెడం బాలాజీలకు పరుచూరు జనాల నుంచి వ్యక్తమవుతున్నాయి. అసలు నియోజకవర్గానికి సంబంధం లేదు.. ఇక్కడ సొంత పార్టీ గురించే తెలియని వ్యక్తిని మాపై బలవంతంగా రుద్దుతారా ? అంటూ వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
యెడం బాలాజీ నాన్‌లోకల్. ఆయన కు ఎలా ఇంచార్జ్ పదవిని కట్టబెట్టారు.? అంతేకాదు గత కొన్నేళ్లుగా విదేశాల్లో ఉంటోన్న వ్యక్తికి ఇక్కడ ప్రజల సమస్యలు ఆయనకు ఎలా తెలుస్తాయి. గతంలో చీరాలలో ఓడిపోయి.. వైసీపీ నుంచి బయటకు వచ్చి.. టీడీపీలో చేరి లాలూచీ రాజకీయాలు చేయలేదా? పైగా.. మీ మొహం ఎవరికి తెలుసు? కనీసం పరుచూరు నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అయినా తెలుసా? అని అంటున్నారు. నియోజకవర్గం పట్టుమని పది నుంచి 20 గ్రామాల పేర్లు …. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చెప్పలేని వ్యక్తి బాలాజీ అని వైసీపీ కేడర్ మండిపడుతోంది.
కేవలం డబ్బులు బాగా ఉన్నాయనే ఏకైక కారణంతోనే బాలాజీకి ఇంచార్జ్ పదవిని ఇచ్చారని అంటున్నారు పరుచూరు ప్రజలు. స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయని.. వాటిపై బాలాజీకి అవగాహ న ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. సాగునీటి సమస్యలు, రైతుల సమస్యలు.. గ్రామాల్లో సమస్యలు ఇలా అనేకం ఉన్నాయని.. వాటిపై కనీసం అవగాహన లేని ఇలాంటి వ్యక్తిని ఇక్కడ నిలబెట్టడం వెనుక జగన్ కైనా.. కనీసం ఆలోచన ఉందా ? అన్న ప్రశ్నలే ఇప్పుడు పరుచూరులో బాగా హైలెట్ అవుతున్నాయి. ఏదేమైనా పరుచూరు క్యాండెట్ విషయంలో జగన్‌కు కూడా పెద్దగా ఆశలు లేనట్టు ఉన్నాయని స్థానిక వైసీపీ కేడరే నిరాశతో చెపుతోన్న మాట..!