ఎన్నికల ప్రచారం అంటే.. ప్రత్యర్థులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ప్రత్యర్థులపై విరుచుకుపడడమే రాజకీయం అనుకుంటున్నారు. ప్రస్తుత పాలిటిక్స్‌లో ఇవి తప్పుకాకపోయినా.. కొన్నికొన్ని సమయాలు, సందర్భాలు అనూహ్యంగా కలిసి వచ్చినప్పుడు.. వాటిని తమకు అనుకూలంగా మార్చుకుని.. ప్రయత్నించడం కూడా రాజకీయమే! ఇప్పుడు ఇలాంటి అద్భుత అవకాశమే.. టీడీపీ అధినేత చంద్రబాబుకు వచ్చింది. ఆయనకే కాదు.. కూటమి పార్టీలకు కూడా ఇది ఒక అయాచిత అవకాశమేనని చెప్పాలి. ఈ అవకాశం ఎంతగా ఉందంటే.. ఏకంగా 66 లక్షల పైచిలుకు ఓటు బ్యాంకు సొంతమయ్యేంతగా!
నమ్మశక్యంగా లేదా? అయినా.. పచ్చినిజం. ఒక్క ఓటు కోసమే ఎంతో తపిస్తున్న తన్నుకుంటున్న రోజులు ఇవి. సో.. ఇలాంటి సమయంలో అయాచితంగా వచ్చిన అవకాశం రూపంలో 66 లక్షల ఓటు బ్యాంకు సొంతం కావడం అంటే మాటలా? అయితే.. ఈ అవకాశం అందుకునేందుకు 66 లక్షల ఓట్లను సొంతం చేసుకునేందుకు కొంచెం ట్రై చేయాలి.. మరింత మనసు పెట్టాలి.. ఆ 66 లక్షల మంది మనసును టచ్ చేయాలి అంతే! ఇక, వెనుదిరిగి చూసే ఛాన్సేలేదు. ఇంట్లో పడుకున్నా.. అధికారం వచ్చి తలుపుతడుతుంది. మరి ఆ అవకాశం ఏంటనేగా ప్రశ్న. ఆ 66 లక్షల ఓట్లు ఎవరివనేగా ప్రశ్న…
వారే.. ఏపీలో సామాజిక పింఛన్లు తీసుకునే 66.7 లక్షల మంది. వీరు ప్రతినెలా 1న సంక్షేమ పింఛన్లు అందుకుంటున్నారు. అయితే..వీరి పరిస్థితి ఇప్పుడు డోలాయమానంలో పడింది. ఎందుకంటే.. ఒకవైపు కూటమి పార్టీల తరఫున చంద్రబాబు ఒక్కరే పింఛన్లపై మాట్లాడుతున్నారు. తాము అధికారంలోకి రాగానే.. ఈ పింఛన్లను రూ.4000 ఇస్తామని చెబుతున్నారు. అదికూడా.. ఏప్రిల్(అధికారంలో లేకపోయినా) నుంచి లెక్కగట్టి మరీ మొత్తంగా జూలైలో జమచేస్తామని చెబుతున్నారు. అంటే.. సామాజిక పింఛన్లు తీసుకునేవారికి ఇది పెద్ద జాక్ పాట్. ఒకేసారి రూ.1000 పెరుగుతున్నాయి. ఇది మంచిది మాత్రమే కాదు.. అతి పెద్ద భారీ బెనిఫిట్ కూడా.
కానీ.. ఇక్కడ ప్రధాన సందేహం ఏంటంటే.. ఇచ్చే 4000లపై కాదు.. ఒక్క చంద్రబాబు మాత్రమే ఈ హామీ ఇస్తున్నారు తప్ప.. కూటమి పార్టీల అగ్రనేతలుగా ఉన్నవారు ఎక్కడా ఒక్క మాటైనా మాట్లాడడం లేదు. దీంతో చంద్రబాబు ఎంత గింజుకున్నా.. ఈ పింఛన్ల పెంపు వ్యవహారంపై పెద్దగా చర్చ జరగడం లేదన్నది వాస్తవం. కట్ చేస్తే.. ఇప్పుడు దీనికి ప్రాధాన్యం పెరిగింది. ఆశ్చర్యంగా ఉన్నా.. నిజం. ఎందుకంటే.. తాజాగా మేనిఫెస్టో విడుదల చేసిన వైసీపీ అధినేత సీఎం జగన్.. సామాజిక పింఛన్ల పెంపుపై తీవ్ర నిరాశను, నిస్పృహను నింపేశారు. ఇప్పట్లో అంటే.. ఏకంగా మూడేళ్లపాటు తాను పించన్లను పెంచేది లేదన్నారు.
అంతేకాదు.. 2028, 2029 సంవత్సరాల వరకు ఆగితే.. అప్పుడు కూడా రూ.250 చొప్పున రెండు విడతలుగా పెంచి రూ.500 పెంచుతామన్నారు. దీంతో పింఛను దారులు అయోమయంలో పడ్డారు. ఒకింత నిరాశలోనూ కూరుకుపోయారు. ఒకవైపు పెరుగుతున్న ధరలు, మందులు, ఇతర ఖర్చుల కారణంగా సామాజిక పింఛను దారులు తమ పింఛన్లను కూడా పెంచాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ, ఈ విషయంలో టీడీపీ సానుకూలంగా ఉన్నా.. కూటమి పార్టీల అగ్రనేతలు దీనిని ప్రచారంలోకి తీసుకురాకపోవడం `నమ్మకం`పై ప్రభావం చూపుతోంది.
ఈ విషయంలో కొంత జాగ్రత్తగా తీసుకుని.. మనసు పెట్టి ప్రచారం చేసి.. సామాజిక పింఛన్ల లబ్ధిదారుల మనసును టచ్ చేస్తే.. ఇప్పటికిప్పుడు తమపింఛన్లు పెరుగుతాయని వారు నమ్మితే.. ఏకంగా 66 లక్షల ఓట్లు.. గుండుగుత్తగా కూటమికి పోటెత్తడం ఖాయం. గెలుపు గుర్రం జగజ్జేయంగా పరుగులు పెట్టడం ఖాయం!!
ఏం చేయాలి?
+ చంద్రబాబు ఒక్కరే కాదు.. సామాజిక పింఛను పెంపుపై కీలక నేతలు కూడా చెప్పాలి.
+ ప్రజల్లో ఉన్న అపోహలను తక్షణం తొలగించి.. వారిని నమ్మించేలా.. నమ్మకం కలిగించేలా వ్యవహరించాలి.
+ క్షేత్రస్థాయిలో పింఛను దారులకు వివరించేలా సీబీన్ ఆర్మీని సమాయత్తం చేయాలి.
+ వైసీపీ ప్రకటించిన పింఛనుకు.. టీడీపీ కూటమి పార్టీలు ఇస్తామన్న పింఛన్లకు మధ్య వ్యత్యాసాన్ని వివరించగలిగాలి.
+ బాబు చెబితే చేస్తాడు! – అనేధీమా సామాజిక పింఛను దారుల్లో కలిగించేలా పక్కా ప్రణాళికను సంపూర్ణంగా అమలు చేయాలి.
+ ఫలితంగా.. ఆ 66 లక్షల ఓటర్లలో కనీసంలో కనీసం 40 లక్షల ఓట్లు పడితే.. టీడీపీ కూటమి గెలుపును ఎవరూ అడ్డుకునే పరిస్థితి లేదు.