ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో మరెక్కడా లేని విధంగా ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల వద్దకే పాలన అందిస్తున్నామని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే, వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ప్రజల సమాచారాన్ని సేకరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సచివాలయ వ్యవస్థపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సంచలన విమర్శలు చేసింది. వార్డు సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాగ్ అభిప్రాయపడింది.
నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు, నగర పంచాయతీలలో ఈ వ్యవస్థ 74వ సవరణ చట్టం, ఏపీ పురపాలక చట్టాలను నీరుగార్చిందని స్పష్టం చేసింది. స్థానిక పాలనలో వికేంద్రీకరణను సచివాలయ వ్యవస్థ దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది. వార్డు సచివాలయ వ్యవస్థతో వార్డు కమిటీల వ్యవస్థ అసంబద్ధంగా తయారయిందని అభ్యంతరం వ్యక్తం చేసింది. సచివాలయ వ్యవస్థ ద్వారా వార్డు కమిటీల ప్రయోజనాల దెబ్బతిన్నాయని చెప్పింది. ఎన్నికైన పాలకవర్గానికి పురపాలక కమిషనర్ ద్వారా వార్డు సచివాలయ వ్యవస్థ జవాబుదారీగా ఉందన్న ప్రభుత్వ వాదనను తోసి పుచ్చింది.
వార్డు సచివాలయంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వామ్యం కాలేదని స్పష్టం చేసింది. రాజ్యాంగ నిబంధనలు పురపాలక చట్టాల అమలు కోసం ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. మరి, కాగ్ నివేదికపై వైసీపీ ప్రభుత్వం స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నద ఆసక్తికరంగా మారింది.