నవరత్నాలతో ఏపీ సీఎం జగన్ పేదల జీవితాల్లో వెలుగులు తెచ్చారని, అందుకే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి జనం పట్టం కట్టారని వైసీపీ నేతలు గప్పాలు కొడుతోన్న సంగతి తెలిసిందే. కరోనా సంక్షోభం, లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు ఆపకుండా అమలు చేస్తున్నారని, ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు.
అయితే, జగన్ పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని, గొప్పలకు పోయి ఏపీని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని టీడీపీ సహా విపక్షాలన్నీ విమర్శలు గుప్పిస్తున్నాయి. తలకు మించిన అప్పులు…దాని తాలూకా వడ్డీలు వెరసి పన్నుల రూపంలో జగన్ ప్రజల నడ్డి విరుస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు దుయ్యబడుతున్నారు. ఇప్పటికే ప్రజలపై జగన్ `పన్ను` పోటుతో జగన్ దాదాపు 20 వేల కోట్ల రూపాయలు వసూలు చేసి ఖజానా నింపుకున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఆ విమర్శలకు ఊతమిచ్చేలా ఏపీని జగన్ అప్పుల ఊబిలో దించుతున్నారని కంప్ట్రోలర్ ఆడిటర్ అండ్ జనరల్ (కాగ్) సంచలన విషయాలు వెల్లడించింది. జగన్ ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో 45 పైసలు అప్పుగా తీసుకొచ్చినవేనని కాగ్ తేల్చింది. రాష్ట్రంలో ఖర్చు చేస్తున్న ప్రతి 100 రూపాయల్లో రూ. 45 అప్పుగానే సమకూర్చుకున్నట్టు కాగ్ విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.
తాజాగా విడుదలైన అప్పుల గణాంకాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచిందని కాగ్ వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను కాగ్ విడుదల చేసిన 10 నెలల గణాంకాలలో ఏపీ అప్పుల చిట్టా బట్టబయలైంది. జనవరి నెలాఖరు వరకు ఏపీ రూ. 73,912.91 కోట్ల అప్పు తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలఖారు వరకు రెవెన్యూ రాబడి రూ. 85,987.04 కోట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.88,238.70 కోట్లుగా ఉంది.
గత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు నాటికి రూ.46,503.21 కోట్ల అప్పుంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 73,912.91 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం అప్పు అంచనాతో పోలిస్తే ఇది 153 శాతం అధికంగా ఉండడం కలవరపెడుతోంది. ఏప్రిల్ 2020 నుంచి డిసెంబరు వరకు రూ.44,250 కోట్లను ఏపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి రుణంగా సేకరించింది.
ఇందుకోసం స్పెషల్ డ్రాయింగ్ సౌకర్యం, చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంది. ఇలా జగన్ జనాలకు అప్పు చేసి పప్పుకూడు పెడుతూ పోతే చివరకు నవ్యాంధ్రప్రదేశ్ కాస్తా అప్పులాంధ్రప్రదేశ్ గా మారుతుందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ సంస్థలు ముందుకు రావడం లేదని, ఈ అప్పుల వ్యవహారం తెలిస్తే ఇక కొత్త పెట్టుబడులు రావని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.