కరోనా సంక్షోభం, లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులున్నా ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే. అయితే, జగన్ పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని, గొప్పలకు పోయి ఏపీకి జగన్ అప్పులు మిగులుస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తలకు మించిన అప్పులు…దాని తాలూకా వడ్డీలు వెరసి పన్నుల రూపంలో జగన్ ప్రజల నడ్డి విరుస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఏపీని జగన్ అప్పుల ఊబిలో దించుతున్నారని కంప్ట్రోలర్ ఆడిటర్ అండ్ జనరల్ (కాగ్) గతంలోనే సంచలన విషయాలు వెల్లడించింది. జగన్ ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో 55 పైసలు అప్పుగా తీసుకొచ్చినవేనని కాగ్ తేల్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇంకా సగం కూడా పూర్తికాకుండానే ఏడాది కాలానికి అంచనా వేసిన అప్పు మొత్తాన్ని తీసుకుందని షాకింగ్ నిజాలు వెల్లడించింది. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ అప్పుల చిట్టాపై కాగ్ తాజాగా మరో సంచలన విషయం వెల్లడించింది.
ప్రస్తుతం ఏపీపై రూ.3.73 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నట్టు కాగ్ వెల్లడించింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే…గత ఏడాది నవంబరు నాటికే ఈ అప్పు రూ.3.73 కోట్లకు చేరిందని కాగ్ షాకింగ్ నిజం చెప్పింది. ఏప్రిల్ 2020-మార్చి 2021 సంవత్సరానికిగానూ ఏపీకి రూ.48.295 కోట్ల అప్పును నిర్దేశించారు. అయితే, గత ఏడాది ఏప్రిల్-నవంబరు మధ్య రూ.73,811 కోట్లు అప్పు చేశారని, ఒక్క నవంబరులోనే రూ.13 వేల కోట్ల రుణం తీసుకుందని కాగ్ వెల్లడించింది. 2020-21 సీజన్ లో ఏపీ సర్కారు నెలకు సగటున రూ.9,226 కోట్ల మేర అప్పు చేసినట్టు కాగ్ పేర్కొంది. అప్పులు తీసుకోవడంలో ఇదే ఊపు కొనసాగితే మాత్రం 2021 మార్చి నాటికి ఏపీ ప్రభుత్వం మరో రూ.30 వేల కోట్లు అప్పు చేయొచ్చని వెల్లడించింది. అదే జరిగితే ఈ 2020-21 సీజన్ లో ఏపీ అప్పుల భారం రూ.1.04 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.
2014లో రాష్ట్ర విభజన సమయానికి, చంద్రబాబు సీఎం కాక ముందు ఏపీ అప్పుల విలువ రూ.97,000 కోట్లుగా ఉంది. చంద్రబాబు 5 ఏళ్ల పాలన సమయంలో రూ.1.61లక్షల కోట్లు అప్పు చేసినట్టు తెలుస్తోంది. దీంతో, 2019 మార్చి నాటికి ఏపీ అప్పు 2.58లక్షల కోట్లుగా ఉంది. 2019 ఏప్రిల్ నుంచి 2020 నవంబరు వరకు ఏపీపై రూ.1,14 లక్షల కోట్ల అప్పు ఉందని కాగ్ వెల్లడించింది. 2021 మార్చినాటికి ఇంకో రూ.30 వేల కోట్లు అప్పు చేసే అవకాశముంది. అంటే, కాగ్ చెప్పిన దాని ప్రకారం 2021 మార్చి నాటికి జగన్ తన 21 నెలల పాలనలోనే రూ.1.44 లక్షల కోట్లు అప్పు చేసే అవకాశముంది. దీనిని బట్టి తన 19 నెలల పాలనలో జగన్ సుమారు రూ.1.20 లక్షల కోట్లు అప్పు చేశారు. చంద్రబాబు 5 ఏళ్లలో చేసిన అప్పు మొత్తంలో సింహభాగం అప్పును జగన్ 19 నెలల్లో చేయడం విశేషం. కనుక, చంద్రబాబు 5 ఏళ్లలో చేసిన అప్పును జగన్ రెండేళ్లలో చేసే అవకాశముంది. ఏపీలో ప్రజలకు అప్పు చేసి పప్పుకూడు పెడుతున్న జగన్…. 2021 మార్చి నాటికి ఏపీ అప్పు లక్షన్నర కోట్లు దాటేలా చేసినా ఆశ్యర్యపోనవసరం లేదన్న వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో జగన్ ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో 55 పైసలు అప్పేనని….వచ్చే ఏడాది మార్చినాటికి జగన్ ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి అప్పే అయినా ఆశ్చర్యపోనవరసర లేదని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇలా గొప్పలకు పోయి అప్పు చేసి పప్పుకూడు పెట్టడం….ఆ తర్వాత ప్రజలపై చాపకింద నీరులా పన్నులు విధించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.