ఏపీ సీఎం జగన్ పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని, గొప్పలకు పోయి ఏపీని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని టీడీపీ సహా విపక్షాలన్నీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని విపక్షాలే కాదు…కంప్ట్రోలర్ ఆడిటర్ అండ్ జనరల్ (కాగ్) కూడా చాలాసార్లు చెప్పింది జగన్ ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో దాదాపు అర్థ రూపాయి అప్పేనని గతంలోనే ఎన్నోసార్లు తేల్చి చెప్పింది.
అయినప్పటికీ, ఏనుగు మీద నీళ్లు పడ్డట్టున్న జగన్ సర్కార్…తమ అప్పుల తప్పులను సమర్థించుకుంటూ….అప్పుల కుప్పను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. సరే అప్పులు చేస్తే చేశారు…కనీసం ఆ లెక్క చెప్పండి అని ఏపీ సర్కార్ ను కాగ్ అడుగుతున్నా స్పందన కరువైన వైనం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏపీ ఖజానా జమా ఖర్చులు తేల్చడానికి తమకు అవసరమైన సమాచారాన్ని జగన్ ప్రభుత్వం సరిగ్గా ఇవ్వడం లేదని కాగ్ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సనానికి సంబంధించి ఒక్క నెల జమా ఖర్చులు కూడా ఏపీ ప్రభుత్వం వెల్లడించలేకపోయిందని కాగ్ చెబుతోంది. ఖజానాకు సంబంధించిన నెలవారీ లెక్కలపై కాగ్ మళ్లీ వివరాలు పంపాలని మరోసారి ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లుగా తెలుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఐదో నెల గడుస్తున్నా, ఇంకా తొలి నెల లెక్కలు కూడా పంపలేదని తెలుస్తోంది. అంతేకాుద, 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తుది లెక్కలు కూడా పెండింగ్లోనే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి ప్రతీ నెలా ఆదాయ ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు కాగ్ మదింపు చేసి అధికారికంగా వెబ్సైట్లో పెడుతుంటుంది. అన్ని రాష్ట్రాలూ లెక్కలను ఆర్బీఐకి పంపితే…అది లెక్కలేసి ఆదాయం ఎంత.. ఖర్చు ఎంత..దేనికి ఎంత ఖర్చు పెట్టారు వంటి వివరాలు వెల్లడిస్తుంది. అయితే తెలంగాణ లెక్కలు చూపుతున్నా…ఆంధ్రా నుంచి ఒక్క నెల లెక్క కూడా ఖరారు కాలేదట. రుణాలు, గ్యారెంటీల వివరాలు సిద్ధం చేయడంలో సందిగ్ధతే ఈ జాప్యానికి కారణమని తెలుస్తోంది.