వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలపై జనాల మూడ్ ఎలాగుందనే విషయంపై ఏబీపీ+సీ ఓటర్ జాయింట్ గా ఓ సర్వే నిర్వహించాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో తొందరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. రకరకాల పేర్లతో మనదేశంలో ఎన్నికలకు ముందు, పోలింగ్ తర్వాత వివిధ సంస్థలు సర్వే చేయడం మనకు కొత్తేమీ కాదు. కాకపోతే ప్రతిసారి సర్వే రిపోర్టు పేరుతో వెలువడే ఫలితాలన్నీ కరెక్టని చెప్పేందుకు లేదు.
అయితే ఎన్నికలకు ముందు జరిగే మూడ్ ఆఫ్ ది పీపుల్ సర్వే తో పార్టీలు తమ లోపాలను సరిచేసుకోవటానికి ఉపయోగపడతాయనటంలో సందేహంలేదు. ఇప్పుడు సి ఓటర్ నిర్వహించిన సర్వే కూడా దాదాపు అలాంటిదనే చెప్పాలి. స్థూలంగా సర్వే రిపోర్టును చూస్తే అర్ధమవుతున్నదేమంటే ఐదు రాష్ట్రాల్లో ఎక్కడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని. పంజాబ్ లో మాత్రమే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో ఇక్కడ కూడా ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సొస్తుందని అర్థమవుతోంది.
పంజాబ్ కాకుండా 2022 లో ఎన్నికలు జరిగే మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ( యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్ మరియు గోవా) బీజేపీ విజయం సాధిస్తుందని సి ఓటర్ సర్వే అంచనా వేసింది. యుపిలో, బీజేపీ దాదాపు 60 సీట్లు కోల్పోవచ్చని, అయితే ఇప్పటికీ అధికారాన్ని నిలుపుకుంటుందని పేర్కొంది.
ఇక అతి త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పంజాబ్ లో అధికారాన్ని కోల్పోతోందని సంకేతాలు కనబడుతున్నాయంటె థాంక్స్ టు నవ్ జోత్ సింగ్ అండ్ అమరీందర్ సింగ్ అనే చెప్పాలి. వీళ్లిద్దరు కలిసి పార్టీని రాచి రంపాన పెట్టేశారు. బాగా బలంగా ఉన్న పార్టీని కేవలం సిద్ధూయే గబ్బు పట్టించాడని అర్ధమవుతోంది. సిద్ధూ అరాచకం వల్ల పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా ప్రతిరోజు గొడవలే గొడవలు. దీంతో జనాలు బాగా విసిగిపోయారు. ఈ కారణం వల్లే తమ ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి వేస్తామని 35 శాతం మంది చెప్పారట. కాంగ్రెస్ రెండోస్ధానం, ఎస్ఏడీ మూడోస్థానంలో ఉన్నాయి. బీజేపీని పట్టించుకున్న వాళ్ళే కనబడలేదు.
జనాల మూడ్ ప్రకారం చూస్తే ఆప్ వెన్నంటే కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, ఎలక్షనీరింగ్ లో అమరీందర్+సిద్ధూలు జాయింట్ గా పని చేస్తే అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోలేదు. జనాల మూడ్ ఆప్ విషయంలో 35 శాతమైతే కాంగ్రెస్ వైపు 29 శాతముంది. నిజానికి సర్వేలన్నీ నూరుశాతం వాస్తవమని అనుకునేందుకు లేదు. కాకపోతే జననాడి ఎలాగుందో అర్ధం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.
ఇక బీజేపీ సంగతి చూస్తే వ్యవసాయ చట్టాల ప్రభావం చాలా తీవ్రంగానే పడేట్లుంది చూస్తుంటే. నరేంద్రమోడి సర్కార్ తెచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైందే పంజాబ్ లో. ఇక్కడి నుండి ఉద్యమం ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు పాకింది. ఈమధ్యనే పంజాబ్ లో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ప్రచారం కూడా చేసుకోలేకపోయిన విషయం తెలిసిందే. మొత్తం మీద చాలా సైలెంట్ గా ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ప్రభావాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్నట్లు అర్ధమవుతోంది.