ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొన్ని నెలలపాటు కొనసాగించాలంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వైవీ సుబ్బారెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత సి. రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైవీ సుబ్బారెడ్డికి మెదడు లేదని, ఇన్నేళ్ళకు రాజధాని సుబ్బారెడ్డికి గుర్తుకొచ్చిందా అంటూ రామచంద్రయ్య షాకింగ్ కామెంట్లు చేశారు. సుబ్బారెడ్డి దెబ్బకు టీటీడీ అతలాకుతలమైందని, అటువంటి ఆయన రాజధాని గురించి మాట్లాడటం హేయనీయమని రామచంద్రయ్య దుయ్యబట్టారు.
సొంత జిల్లానే జగన్ పట్టించుకోలేదని, ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు దోపిడీకి తెరలేపిన జగన్ ఇప్పుడు ప్రక్షాళన అని నీతి వాక్యాలు చెబుతున్నారని అన్నారు. ప్రపంచంలో అత్యంత అవినీతిపరుడు జగన్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రామ చంద్రయ్య. రాష్ట్రంలోని అన్ని వర్గాలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని, ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినా జగన్ పట్టించుకోలేదని అన్నారు. వైసీపీలో సామాజిక సాధికారత అన్న పదానికి అర్థం లేదని, కార్పొరేషన్ చైర్మన్ లకు కనీసం కుర్చీలు కూడా లేవని ఎద్దేవా చేశారు.
శ్మశానాలను కూడా వదలకుండా వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని, ఏపీలో దుర్మార్గమైన పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అన్ని రంగాలలో సీఎం జగన్ విఫలమయ్యారని, బలిజలకు జగన్ ఒక్క సీటు కూడా కేటాయించలేదని, బలిజల ప్రాముఖ్యత ఉన్నచోట కూడా టికెట్ ఇవ్వలేదని విమర్శించారు. సిద్ధం బ్యానర్లకు అర్థమేమిటో జగనే చెప్పాలని, జగన్ ను ప్రజలు ఇక ఉపేక్షించే పరిస్థితి లేదని రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.