హోరాహోరీ విమర్శలతో.. పోటాపోటీ ఆరోపణలతో.. సంచలన వ్యాఖ్యలతో.. సవాళ్లతో రాజకీయ రణరంగాన్ని వేడెక్కించిన ఉప ఎన్నికల సమరంలో ఇక ప్రచారానికి తెర పడనుంది. తెరవెనక ప్రలోభాలకు రంగం సిద్ధమైంది. ఇటు తెలంగాణలోని హుజూరాబాద్‌లో.. అటు ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలులోనూ ఇప్పుడు రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. నేడు (అక్టోబర్ 27) సాయంత్రం 5గంటలకు ప్రచారానికి తెర పడింది.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. అక్టోబర్ 30న ఈ రెండు స్థానాలకు పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాజకీయాలను రగిల్చిన హుజూరాబాద్ ఉప ఎన్నికకు మరింత సమయం దగ్గర పడింది. ఇన్ని రోజులు ప్రచారంతో హోరెత్తించిన ప్రధాన పార్టీలు ఇప్పుడిక తెరవెనక వ్యూహాలకు.. ప్రలోభాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన పార్టీ నుంచి బయటకు వెళ్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనకే సవాలు విసిరేందుకు సిద్ధమైన ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను తన మేనళ్లుడు హరీష్ రావు భుజాల మీద మోపిన కేసీఆర్.. అక్కడి పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. మరోవైపు ఈ ఎన్నికలో విజయం సాధించి తన రాజకీయ భవిష్యత్‌ను కాపాడుకోవాలనే పట్టుదలతో ఉన్న ఈటల రాజేందర్ బీజేపీ తరపున పోటీలో దిగి గెలుపు కోసం గట్టిగానే పోరాడుతున్నారు. మరోవైపు ఏపీలోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార పార్టీ వైసీపీ విజయం నల్లేరు మీద నడకేననే అభిప్రాయాలున్నాయి. ఈ ఏడాది మార్చిలో అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.
దీంతో వైసీపీ తమ అభ్యర్థిగా దివంగత వెంకట సుబ్బయ్య భార్య సుధను బరిలో దించింది. రాజకీయ విలువల కోసం సంప్రదాయాన్ని పాటించడం కోసమని జనసేన, టీడీపీ పోటీ నుంచి తప్పుకున్నాయి. కానీ కాంగ్రెస్, బీజీపీ పోరుకు సై అనడంతో పోలింగ్ తప్పలేదు. ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. దీంతో ఇక ఈ రోజు రాత్రి నుంచే ప్రజలకు డబ్బులు మద్యం పంచే ప్రక్రియ షురూ కానుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ ప్రచారంలో ప్రత్యక్షంగా ఓటర్లను మెప్పించిన పార్టీలు ఇకపై తెరవెనుక మంత్రాంగానికి సిద్ధమయ్యాయి.
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఓటుకు ఇంత అని డబ్బులు పంచేందుకు రహస్యంగా ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మద్యం సీసాలను కొన్ని చోట్ల పంపిణీ చేశారనే ప్రచారం ఉంది. బహిరంగంగా ఎంత ప్రచారం చేసినప్పటికీ.. ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచి లోలోపల జరిగే పంపిణీ కార్యక్రమంపైనే అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉంటాయన్నది తెలిసిన రహస్యమే. ఇటు హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంది కాబట్టి ఈ పార్టీల నుంచి ప్రజలకు భారీగానే తాయిళాలు ముట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇక బద్వేలులో వైసీపీకి తిరుగులేదని భావిస్తున్నప్పటికీ ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో అక్కడ కూడా పంపిణీ ప్రక్రియ జోరుగానే సాగే ఆస్కారం ఉంది.