రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత.. చంద్ర బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నా యి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నగరాల్లో రాకపోకలు పెరిగి.. రెండు రకాలుగా ఇక్కడ ప్రజలు ఆదాయం పెంచుకునేందుకు మార్గం ఏర్పడింది. అమరావతి రాజధాని పనులు ఊపందుకున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ.. కూడా సచివాలయం నుంచే జరుగుతున్నాయి. ఇక, ప్రభుత్వ శాఖలకు మంత్రులు వస్తున్నారు.
దీంతో ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు సచివాలయాలకు వస్తున్నారు. ఫలితంగా స్థానికంగా రవాణా రంగం డెవలప్ అయింది. దీంతో ఆటో కార్మికులు, రిక్షా కార్మికులు కూడా లబ్ధి పొందుతున్నారు. ఒకప్పుడు ఈ పరిస్థితి లేదని వారు చెబుతుండడం గమనార్హం. దీనికితోడు చిరు వ్యాపారాలు కూడా పుంజుకున్నాయి. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నా.. కుటుంబం గడిచి పోతుందన్న ఫీలింగ్ కనిపిస్తోంది.
అదేవిధంగా టీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగుతోంది. రియల్ ఎస్టే ట్ రంగం విజయవాడ, గుంటూరుల్లో పుంజుకుంటోంది. దీంతో ఇక్కడ ఆర్థిక లావాదేవీలు.. జోరుగా సాగుతున్నాయి. ఇదిలావుంటే.. అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెట్టేవారు.. జోరుగా వస్తుండడంతో హోటళ్లు కిక్కిరిసి పోతున్నాయి. ఎక్కడా ఖాళీ అన్నదే కనిపించడం లేదు. విజయవాడ, గుంటూరు, తెనాలిలోని హోటళ్లు కూడా.. ముందుగానే బుక్కయిపోతున్నాయి.
ఇక, ట్యాక్సీ సహా.. ఇతర రవాణా రంగాల్లో ఉన్న వారికి కూడా చేతినిండా పని కనిపిస్తోంది. రాజధానిపై చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇలాంటి పరిస్తితి ఉంటే.. మున్ముందు.. మరింత పుంజుకునేందు కు అవకాశం ఉంటుందని చిరు వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కడికక్కడ చిరు వ్యాపార దుకాణాలు.. భారీ ఎత్తున పెరిగిపోవడం గమనార్హం. జగన్ హయాంలో ఇలాంటి పరిస్థితి లేకపోగా.. రాజధాని ప్రాంతం పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడు దీనిని శుభ్రం చేయడంతోపాటు.. నిర్మాణ పనులను కూడా ప్రారంభించనున్నారు.