జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ తీసుకున్న అనేక అనాలోచిత నిర్ణయాలపై ప్రభుత్వ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. జగన్ పాలనలో తాము కూడా అమ్మో ఒకటో తారీకు అనే రీతిలో జీతాల కోసం ప్రతినెలా 5 నుంచి 7వ తారీకు వరకు ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందని ఉద్యోగులు వాపోతున్నారు.
ఏపీ అప్పులు ఊబిలో కూరుకుపోయిందని, అందుకే ఒకటో తారీకున జీతాలు కూడా ఇవ్వలేకపోతోందని జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ విమర్శలపై ఆర్థిక శాఖా మంత్రి వివరణ…ఉద్యోగులకు మరింత చిరాకు తెప్పించేలా ఉంది. రెండ్రోజులు ఆలస్యమైనా జీతాలు ఇస్తున్నాం కదా అంటూ బుగ్గన తాపీగా చెప్పిన సమాధానంపై ఉద్యోగులంతా గరంగరంగా ఉన్నాయి. ఒంటిపూట భోజనానికి ఇబ్బందిపడే కార్మికులు, చిరు వ్యాపారులు.. జీతం రెండ్రోజులు ఆలస్యమైందంటున్న ఉద్యోగులు.. ఎవరికి ప్రాధాన్యమివ్వాలి? అని బుగ్గన ఎదురు ప్రశ్న వేశారు.
చాలా మంది ఉద్యోగులు తనతో మాట్లాడారని, 2 రోజులు జీతం ఆలస్యం కావడం వల్ల వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పారని బుగ్గన సెలవిచ్చారు. ఇక, కరోనా దెబ్బకు ప్రపంచమంతా అప్పులు చేస్తోందని, ఏపీ కూడా చేస్తోందని జగన్ సర్కార్ తప్పులు, అప్పులను బుగ్గన వెనకేసుకు వచ్చారు. ఇక, అప్పులు చేయడం …వాటి కోసం తిప్పలు పడడం కూడా పాలనలో ఒక భాగమని బుగ్గన సెలవిచ్చారు.
ఇంకా ఒకడుగు ముందుకేసి….సరదా కోసం కాదు…సంక్షేమం కోసమే అప్పులు చేస్తున్నామని గొప్పగా క్లారిటీనిచ్చారు. దీనిపై టీడీపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు.గవర్నర్ పేరుమీదే అన్నీ నడుస్తాయని, గవర్నర్ పేరు వాడిన వ్యవహారంపై సమాధానం దాటేశారు. ఇక, పాలన అన్నాక ప్రశ్నలు దానికి వివరణలు సర్వ సాధారణమని కొట్టిపారేశారు. కాగ్ వందల ప్రశ్నలు అడుగుతుందని, కానీ, అసలు ప్రశ్న అడగడమే తప్పంటే ఎలా అని తమ లోపాలను సమర్థించుకున్నారు బుగ్గన.
ఇంకా మాట్లాడితే గత ప్రభుత్వాన్ని కూడా కాగ్ వంద ప్రశ్నలు అడిగిందని, తప్పు చేసినట్లేనా అని బుగ్గన …విలేకరులకు ఎదురు ప్రశ్న వేశారు.
నారాయణస్వామి నుంచి వాణిజ్య పన్నుల శాఖను అప్పగించడంపై స్పందించారు బుగ్గన. గతంలో ఆ శాఖ ఆర్థిక మంత్రి దగ్గరే ఉందని, మీ శాఖను మీకే ఇచ్చేస్తున్నానని నారాయణ స్వామి తనతో చెప్పారని, ఆయనలో అసంతృప్తి లేదని సెలవిచ్చారు. స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖను ఆర్థిక శాఖలో చేర్చడం పుకార్లేనని కొట్టిపారేశారు.