వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్…జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వకుండానే విమర్శలు గుప్పించడంపై అవంతి మండిపడ్డారు. కూటమికి అనుకూలంగా అవంతి మాట్లాడడంతో ఆయన టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అవంతిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ పై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. అవంతి శ్రీనివాస్ వంటి ఊసరవెల్లుల సాయం టీడీపీకి అక్కర లేదని బుద్ధా వెంకన్న అన్నారు. జగన్ హయాంలో వైసీపీ నాయకులు సర్వం నాకేశారని, అందులో అవంతి, జగన్ రెడ్డి బాగస్వాములేనని ఆరోపించారు. అవంతికి రాజకీయ జన్మనిచ్చిన చిరంజీవి గారి కుటుంబం, పవన్ కల్యాణ్ కు అవంతి ద్రోహం చేశాడని బుద్ధా ఆరోపణలు గుప్పించారు.
అంతేకాదు, గల్లీ స్థాయి వ్యక్తి అయిన అవంతిని ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్లిన రాజకీయ పునర్జన్మ ఇచ్చిన చంద్రబాబు గారిని అవంతి అవమానించాడని బుద్ధా మండిపడ్డారు. అవంతి సానుభూతి ఈ కూటమి ప్రభుత్వానికి అవసరం లేదని బుద్ధా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. బుద్ధా కామెంట్లతో అవంతికి టీడీపీ తలుపులు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. మరి, జనసేనలో అవంతి చేరతారా లేక బీజేపీ వైపు చూస్తారా అన్నది తేలాల్సి ఉంది.