వైకాపా అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలోని స్వరాజ్ మైదానంలో నిర్మించిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని తన చేతుల మీదగా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. విగ్రహం ముందు `భారత రత్న బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం… ఆవిష్కర్త శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రివర్యులు` అంటూ స్టీల్ ఎంబోజ్డ్ అక్షరాలు ఏర్పాటు చేశారు. అయితే గురువారం అర్థరాత్రి కొందరు దుండగులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరున్న అక్షరాలు పీకేయడంతో రచ్చ స్టార్ట్ అయింది.
వైఎస్ జగన్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ వైసీపీ నేతలు నిరసకు దిగారు. అయితే ఈ విషయంపై తాజాగా టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ.. మాజీ సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉన్నప్పుడు ప్రజల సొమ్ముతో విలాసాలు పోయిన జగన్ కు.. అధికారం పోగానే మతి భ్రమించినట్లు ఉందని బుద్ధా విమర్శించారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు రూ. 404 కోట్లు ఖర్చయినట్లు లెక్కలు చెప్పి.. అందులో రూ.226 కోట్లను జగన్ నొక్కేసారని ఆరోపణలు చేశారు.
విగ్రహం పైన అంబేద్కర్ పేరు కంటే తన పేరునే పెద్దగా రాయించుకున్నారు.. అది సహించలేని అంబేద్కర్ అభిమానులు జగన్ పేరును తొలగించి ఉండవచ్చని బుద్ధా అన్నారు. అంబేద్కర్ ను అడుగడుగునా జగన్ అవమానించారని.. అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేసిన మహానుభావుడు మన మాజీ సీఎం అని బుద్ధా మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ గత ఐదేళ్లలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని గాలికి వదిలేసి.. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారని విమర్శకులు గుప్పించారు.
అంబేద్కర్ మద్యం మాన్పించాలని చెబితే.. జగన్ మద్యంతో కోట్లు కొల్లగొట్టాడు. మద్య నిషేధం పేరుతో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు. సంపద సృష్టించమని అంబేద్కర్ చెబితే… ఉన్న సంపదను దోచుకున్నారు. అసలు జగన్ కు అంబేద్కర్ పేరెత్తే అర్హత కూడా లేదు అంటూ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు.