ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల పోలింగ్ తేదీకి కొద్ది రోజుల ముందు జరిగిన ఈ హత్య వ్యవహారం ఇప్పటికీ పెను దుమారం రేపుతోంది. వివేకా వంటి హై ప్రొఫైల్ వ్యక్తి హత్య జరిగి మూడేళ్లు కావస్తున్నా…అసలు దోషులెవరన్నది తేలలేదు. దీంతో, ఈ కేసు విచారణపై వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు.
వివేకా హత్య కేసుకు సంబంధించి తమ కుటుంబ సభ్యుల్లో కొందరిపై అనుమానాలున్నాయని, వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి సహా పలువురి పేర్లను తాను హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నానని సునీత గతంలోనే మీడియాకు వెల్లడించారు. ఈ కేసు విచారణకు ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందా అని విలేఖరి అడిగిన ప్రశ్నకు సునీత షాకింగ్ సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందో లేదో వాళ్లనే అడగాలని, ప్రభుత్వం సహకరించి ఉంటే తాను సీబీఐను ఎందుకు ఆశ్రయిస్తానని సునీత చెప్పిన వీడియో వైరల్ అయింది.
అయితే, వివేకా మర్డర్ కేసులో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తోన్న వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ పై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న విరుచుకుపడ్డారు. సునీతా రెడ్డి వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్ ను ట్వీట్ చేసిన వెంకన్న…షాకింగ్ కామెంట్లు చేశారు. ”మీ చెల్లెలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు జగన్… నీ నుంచి, నీ ప్రభుత్వం నుంచి సహకారం లేక, ఢిల్లీ రోడ్లపై మీ ఇంటి ఆడపడుచు తిరుగుతుంటే సజ్జలతో డ్రామాలు ఆడిస్తావా?” అని బుద్ధా వెంకన్న చేసిన ట్వీట్ వైరల్ అయింది.