పోలింగ్ రెండు రోజులుండగా బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైనట్లుంది. తమ మాటల వల్లే కాంగ్రెస్ పార్టీకి మైలేజి వచ్చిందా ? హస్తం పార్టీ బలపడేందుకు బీఆర్ఎస్సే అవకాశం ఇచ్చిందా అనే చర్చ పెరిగిపోతోంది. కాంగ్రెస్ ప్రకటించిన సిక్స్ గ్యారెంటీస్ పై పదేపదే నెగిటివ్ గా మాట్లాడి జనాల్లో సానుభూతి పెంచేట్లు చేశామా అనే చర్చలు అభ్యర్ధులతో పాటు నేతల మధ్య జరుగుతోంది. తాముచేసిన నెగిటివ్ ఆరోపణలు, విమర్శలను కాంగ్రెస్ పార్టీ బాగా అడ్వాంటేజ్ తీసుకుందని ఇపుడు విశ్లేషిస్తున్నారు.
అభ్యర్ధుల తరపున చేసిన ప్రచారం, పథకాల అమలు, జనాల్లో వ్యతిరేకత తదితరాలపై పార్టీలో ఇపుడు తీరిగ్గా విశ్లేషణలు మొదలయ్యాయి. ఎందుకంటే కాంగ్రెస్ గెలుపు గ్యారెంటీ అనే చర్చ జనాల్లో బాగా పెరిగిపోతుండటంపై కేసీయార్ అండ్ కో లో ఆలోచనలు మొదలయ్యాయి. ఇదే సమయంలో పథకాల అమలు చేయటంలో కూడా ప్రభుత్వం తరపున చాలా లోపాలున్నట్లు నేతలు ఇపుడు అంగీకరిస్తున్నట్లు పార్టీలో టాక్ మొదలైంది.
అభ్యర్ధుల ప్రచారాన్ని జనాలు చాలాచోట్ల అడ్డుకోవటం అన్నది నెగిటివ్ సిగ్నల్ గా పార్టీ పెద్దలు ఇపుడు ఆలోచిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవాలంటే సెంటిమెంటు మినహా మరే అస్త్రాలు ఏవీ పార్టీ దగ్గర లేవన్న విషయాన్ని అంగీకరిస్తున్నారట. వచ్చేఎన్నికల్లో మూడోసారి గెలవాలంటే పోల్ మేనేజ్మెంట్ తప్ప మరో మార్గంలేదన్న విషయానికి వచ్చారనే టాక్ పార్టీలో బాగా పెరిగిపోతోంది. కీలకమైన ధరణి పోర్టల్, మేడిగడ్డ, ఉద్యోగాల భర్తీ తదితరాల్లో ప్రభుత్వం దారుణంగా ఫెయిలైనట్లు కాంగ్రెస్ పదేపదే ఆరోపణలు చేయటానికి తామే అవకాశం ఇచ్చినట్లు ఇపుడు బీఆర్ఎస్ పెద్దలు నిర్ణయానికి వచ్చారు.
ధరణి పోర్టల్ బ్రహ్మాండమని కేసీయార్ ఒకవైపు చెబుతుంటే మరోవైపు ధరణి పోర్టల్లో లోపాలున్నాయని వాటిని సవరించుకుంటామని కేటీయార్ అంగీకరించారు. మేడిగడ్డ బ్యారేజిలో లోపాలపై కేసీయార్ మాట్లాడవద్దని కేసీయార్ చెప్పినా వినకుండా కేటీయార్ మాట్లాడుతు నిర్మాణాల్లో లోపాలను సవరించుకుంటామని ప్రకటించారు. అలాగే టీఎస్సపీఎస్ ఉద్యోగాల భర్తీలో దారుణంగా ఫెయిలైంది. దీన్ని కేటీయార్ అంగీకరించారు. మూడోసారి అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తానని చెప్పటం కూడా మైనస్ అయ్యిందని పార్టీలో చర్చలు మొదలయ్యాయి. పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు చేయని ప్రక్షాళన మూడోసారి అధికారం ఇస్తే చేస్తామని కేటీయార్ చెప్పటం బాగా నెగిటివ్ అయ్యిందనే చర్చలు పెరిగిపోతున్నాయి.