తెలంగాణలో బీఆర్ఎస్ నేతల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. ఎన్నికలైపోయి ఓడిపోయి మూడు నెలలు అయినా ఇంకా కారు పార్టీ నేతల్లో అక్కసు తగ్గలేదు. ఇది చాలా విచిత్రమైన వ్యవహారంగా ఉంది. ఎన్నికల్లో గెలుపోటములు చాలా సహజం అని అందరికీ తెలిసిందే. ఓడిపోయిన పార్టీకి బాధ ఉండటం చాలా సహజం. ఓ పది రోజులు బాధలో ఉండి తర్వాత మామూలైపోతారు. కాని ఇక్కడ బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రతి చిన్న విషయానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చాలా పెద్దగా రాద్దాంతం చేస్తున్నారు.
ఇపుడు తాజా రగడ ఏమిటంటే మొన్ననే నరేంద్ర మోడీ తెలంగాణలో రెండు రోజులు పర్యటించారు. ఆ సమయంలో మోడీ, రేవంత్ వేదికను పంచుకున్నారు. ఆ సందర్భంగా రేవంత్ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, పెండింగులో ఉన్న నిధులను గుర్తుచేశారు. అభివృద్ధి మోడల్ లో గుజరాత్ కు ఇచ్చినంత ప్రాధాన్యత తెలంగాణాకు ఇవ్వాలని కోరారు. అదే సందర్భంగా మోడీని పెద్దన్నగా అభివర్ణించారు. దాన్ని పట్టుకుని బీఆర్ఎస్ నేతలు కేటీయార్, హరీష్ రావు, కవిత నానా గోల చేస్తున్నారు. మోడీ తెలంగాణాకు పద్దన్న ఎలాగవుతారు ? మోడీని పట్టుకుని రేవంత్ పెద్దన్న అని అనడం ఏమిటంటు విమర్శలు చేస్తున్నారు.
వాస్తవానికి ఈ మీటింగ్ పై ప్రజల్లో సానుకూలత కనిపించింది. ప్రొటోకాల్ పాటించడం కానీ, ప్రధాన మంత్రిని గౌరవించడం కానీ, గౌరవిస్తూనే నిధులు డిమాండ్ చేయడం కానీ అన్నీ కలిపి కొట్టాడు రేవంత్. గత పదేళ్లలో కేసీఆర్ ఏ నాడూ ప్రొటొోకాల్ అనేది పాటించలేదు. దీంతో రేవంత్ శైలి చాలామందికి నచ్చింది. ఈ సమయంలో ఈ విషయంలో రేవంత్ ని విమర్శించడం బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ అని చెప్పాలి.
మోడీని రేవంత్ పెద్దన్న అంటే నిజంగానే పెద్దన్నయిపోతారా ? పెద్దవాళ్ళని అన్నా అనడం వ్యావహారికంలో ఉన్నదే కదా. పైగా వయసులో పెద్దనే కాదు ప్రధానమంత్రి కూడా కాబట్టి మోడీని రేవంత్ పెద్దన్నగా సంబోధించారు. అంతమాత్రాన ఇంతగా గోలచేయాల్సిన అవసరం ఏమిటో అర్థం కావట్లేదు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు, నిధులను కేంద్రం ఇవ్వకపోతే మోడీని రేవంతే ఎలాగూ రివర్సులో గోలచేయటం ఖాయం. ఇపుడు అన్నా అంటారు రేపు దుష్మన్ అని గోలచేయటం రాజకీయాల్లో మామూలే కదా.
అంటే ఇక్కడ అర్ధమవుతున్నది ఏమిటంటే రేవంత్ పైన ఆరోపణలు, విమర్శలు చేయడానికి ఎప్పుడెప్పుడు అవకాశాలు దొరుకుతాయా అని కేటీయార్, హరీష్, కవితలు ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావటమే. అందులోను తమకు అసలు ఏమాత్రం పడని రేవంత్ ముఖ్యమంత్రి అవ్వటమే కారణంగా అర్ధమవుతోంది. రేవంత్ మీద వ్యక్తిగత ద్వేషంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వీళ్ళు ఎంతవీలుంటే అంత గబ్బుపట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వీళ్ళ వ్యవహారాలను జనాలు ఎలాగ అర్ధం చేసుకుంటారో చూడాలి.