బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ నుంచి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు. వారిలో మహేందర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరలేదు. కానీ ఆయన భార్య జెడ్జీ ఛైర్మన్ సునీతా రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితా రెడ్డి మాత్రం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ మాజీ మేయర్లు కూడా కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు.
జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్‌కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, రామగుండం, వరంగల్ మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఇప్పటికే రేవంత్ రెడ్డిని వేరువేరుగా కలిశారు. వీరే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కేంద్రాలు ఖాళీ అవుతున్నాయి. అందరూ కాంగ్రెస్ బాట పడుతున్నారు.
నిన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్‌కు ఇలాంటి పరిస్థితి వస్తుందని గులాబీ బాస్ కేసీఆర్ కలలో కూడా ఊహించి ఉండరు. పార్టీ టికెట్ ఇస్తామన్నా నేతలు ముందుకు రాకపోవడం, పలు నియోజకవ ర్గాల్లో అభ్యర్థులు కరువవడం, తమ ఖర్చులను పార్టీ భరించాలని నేతలు డిమాండ్ చేస్తుండటంతో కేసీఆర్‌కు దిక్కుతోచని స్థితిని ఏర్పడింది. వీటికి తోడుగా రోజు గడుస్తున్న కోద్దీ పార్టీ నుంచి ఎవరు సీఎం రేవంత్ ఇంటికి క్యూ కడతారో తెలియని పరిస్థితి నెలకొంది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ గుర్తొస్తుందని చెప్తూ పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వడానికి కేటీఆర్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారని విమర్శిస్తున్నారు. వీరు ఎంత చెప్తున్నా కొందరు నేతలు మాత్రం కాంగ్రెస్, బీజేపీ బాట పడుతున్నారు. దీంతో రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ నలిగిపోతోందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.