రాజకీయాల్లో ఆవేశం.. ఆగ్రహం కంటే ప్రత్యర్థి ప్లానింగ్ ఏమిటన్న అవగాహన ఉండటం చాలా ముఖ్యం. టెంపర్ మెంట్ ఎంత ఉన్నప్పటికీ.. తొందరపాటు కొంపముంచుతుంది. చిన్న తప్పునకు పెద్దగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా అలాంటి దిద్దుకోలేని తప్పును చేశారు హైదరాబాద్ మహానగర శివారుకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే వివేకానంద. ఒక టీవీ చానల్ నిర్వహించిన పబ్లిక్ చర్చా కార్యక్రమానికి కుత్భుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద.. బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్.. కాంగ్రెస్ అభ్యర్థి పాల్గొన్నారు.
చూస్తుండగానే ఈ పబ్లిక్ చర్చా కార్యక్రమం వాడి వేడిగా మారింది. తీవ్రస్థాయిలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవటం మొదలైంది. నువ్వు కబ్జాదారు అంటే.. నువ్వు కబ్జాదారు అన్న మాటలు అనుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఆవేశానికి గురైన కూనా శ్రీశైలం గౌడ్ .. ‘నువ్వు పెద్ద కబ్జాకోరువి. నీ తండ్రి పెద్ద కబ్జాకోరు’ అంటూ విరుచుకుపడ్డారు. అప్పటివరకు ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే వివేకానంద.. కూన నోటి నుంచి తన తండ్రి ప్రస్తావన రావటంతో తీవ్రస్థాయిలో రియాక్టు అయ్యారు.
అప్పటివరకు ఆయన ప్రదర్శిస్తున్న ఆగ్రహం ఆవేశంగా మారింది. క్షణంలో వెయ్యోవంతు.. బీజేపీ అభ్యర్థి వైపు దూసుకెళ్లిన ఎమ్మెల్యే వివేకానంద.. బీజేపీ అభ్యర్థి గల్లా పట్టుకోవటమే కాదు.. రెండో చేత్తో ఆయన మెడను పట్టేసుకున్నారు. ఈ అనూహ్య పరిణామానికి షాక్ తిన్న వారు.. కొద్ది క్షణాల్లోనే రియాక్టు అయ్యారు. ఇరువురిని విడదీశారు. చర్చా కార్యక్రమం రసాభాసాగా మారింది.
కూనపై వివేకానంద ‘దాడి’ చేశారంటూ ప్రత్యేక వీడియోలు గంట వ్యవధిలో సోషల్ మీడియాలోనూ..వాట్సాప్ గ్రూపుల్లోనూ హల్ చల్ చేశాయి. అదే సమయంలో తండ్రిని పట్టుకొని అంతేసి మాట అన్నప్పుడు కొడుకుగా ఆ మాత్రం రియాక్టు కావటం తప్పా? అంటూ ఎదురుదాడి మొదలైంది. మొత్తానికి ఈ అనూహ్య పరిణామం గ్రేటర్ రాజకీయాల్ని ఒక్కసారి వేడెక్కేలా చేయటమే కాదు..రానున్న రోజుల్లో ఈ ఎన్నికలు మరింత హాట్ హాట్ గా మారతాయన్న అభిప్రాయాల్ని కలిగేలా చేశాయని చెప్పాలి.