మల్లారెడ్డి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా నుంచి సాధారణ మీడియా వరకు కూడా.. ఎమ్మెల్యే మల్లారెడ్డి పేరు సుపరిచితమే. “పాలమ్మినా.. పూలమ్మినా.. కాలేజీలు పెట్టినా..“ అంటూ ఎన్నికలకు ముందు మహా ప్రచారంలోకి వచ్చేసిన బీఆర్ ఎస్ నాయకుడు, ప్రస్తుత మల్కాజిగిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా మడత పేచీ పెట్టారు. ఏకంగా బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నే టార్గెట్ చేశారు. మూడు సీట్లు కేసీఆర్ కుటుంబానికేనా? అంటూ.. తనదైన శైలిలో దులిపేశారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల టికెట్ల ప్రస్తావన వచ్చింది. కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లు.. తమ కుటుంబం నుంచి మూడు పదవులు ఉండాలని అనుకున్నామని చెప్పారు. “కేసీఆర్ సార్ కుటుంబం మూడు పదవులు అనుభవిస్తోందా? లేదా? చెప్పుర్రి.. గైతే.. మాకొద్దా!“ అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. తన మనసులో మాటను కూడా మల్లారెడ్డి బయట పెట్టారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ కుమారుడు భద్రారెడ్డిని మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయిస్తానని మల్లారెడ్డి బాంబు పేల్చారు. అయితే.. కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చెయ్యడానికి తమ కొడుకు సిద్ధమన్నారు. అయితే.. కేసీఆర్ టికెట్ ఇవ్వకపోతే.. ఏం చేస్తారన్న ప్రశ్నకు గప్పటి ముచ్చట గప్పుడు చూద్దాం: అంటూ.. వ్యాఖ్యానించారు.
జగ్గారెడ్డిపై విమర్శలు..
కాంగ్రెస్ నేత, ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డిపై మల్లారెడ్డి విమర్శలు గుప్పించారు. తన పేరు తల్వకుంటే.. జగ్గారెడ్డికి రాజకీయం ఎక్కడిదని ఎద్దేవా చేశారు. ఎంపీ టికెట్ కోసం సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతు న్నాడన్నారు. గతంలో రేవంత్ రెడ్డిని తిట్టిన తిట్లు ఎవరూ మరిచిపోలేదన్నారు. తనకు గోవాలో హోటల్ ఉందని, రాజకీయాలు నుంచి తప్పుకొంటే గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తానని చెప్పారు.