ఢిల్లీ లిక్కర్ స్కాం లో కల్వకుంట్ల కవిత పేరు పదేపదే నానుతుండటం పార్టీకి బాగా మైనస్ అవుతోందని పార్టీలో చర్చలు పెరిగిపోతున్నాయా ? నేతల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. లిక్కర్ స్కామ్ లో తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత ఆ మధ్య చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. తన పాత్ర లేకపోయినా దర్యాప్తు సంస్థలు తనను ఇరికించాలని చూస్తే తాను ఎదుర్కొంటానన్నారు.
తనను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేస్తే జనాల ముందుకు వెళ్ళటం తప్ప ఇంకేం ఆప్షన్ ఉందని చాలా ధీమాగా ఎదురు ప్రశ్నించారు. మరిప్పుడేమో ఈడీ విచారణకు హాజరుకాకుండా తప్పించుకునే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారనే చర్చ పార్టీలో పెరిగిపోతోందట. గతంలో చెప్పుకున్నట్లు నిజంగానే స్కామ్ లో తన పాత్రలేకపోతే నిర్భయంగా విచారణకు హాజరవ్వచ్చు కదానే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకసారి విచారణకు హాజరైన కవిత రెండోసారి విచారణకు హాజరు కావటానికి ఎందుకు భయపడుతున్నారదే చాలామందికి అర్ధం కావటంలేదు.
విచారణను తప్పించుకునేందుకే కవిత సుప్రింకోర్టులో కేసులు వేస్తోందనే అభిప్రాయం జనాల్లో పెరిగిపోతోందట. దీనివల్ల జనాల్లో పార్టీ పలుచనైపోతోందనే అభిప్రాయం నేతల్లో పెరిగిపోతోంది. కవిత చర్యలను సమర్దించలేక అలాగని ఖండించలేక పార్టీ నేతలు నానా అవస్తలు పడుతున్నారట. అరెస్టయితే అక్రమంగా అరెస్టు చేసినట్లు గోల చేయచ్చు. లేదా విచారణకు హాజరవుతుంటే పాత్ర లేదు కాబట్టే కవిత ధైర్యంగా విచారణకు హాజరవుతున్నట్లు జనాలకు చెప్పుకోవచ్చని నేతలు మాట్లాడుకుంటున్నారని సమాచారం.
విచారణకూ హాజరు కాకుండా ఇటు అరెస్టు దాకా వ్యవహారం వెళ్ళకపోవటంతో మధ్యలో కవిత ఎస్కేప్ దారిని వెతుక్కోవటంతోనే అనుమానాలు, సమస్యలు పెరిగిపోతున్నట్లు నేతలు చెప్పుకుంటున్నారు. 20వ తేదీన విచారణకు హాజరవ్వాల్సిందే అని కవితకు ఈడీ నోటీసిచ్చింది. దీన్నుండి తప్పించుకునేందుకు కవిత వేసిన కేసును సుప్రింకోర్టు 24వ తేదీన విచారిస్తోంది. సమస్యంతా ఇక్కడే పెరిగిపోతోందట. 20వ తేదీ విచారణకు కవిత హాజరవుతారా లేదా అన్నదే ఇపుడు టాక్ ఆఫ్ ది స్టేట్ అయిపోయింది. మరి చివరకు కవిత ఏమిచేస్తారో ? కవిత యాక్షన్ కు ఈడీ రియాక్షన్ ఎలాగుంటుందో అనే ఆసక్తి పెరిగిపోతోంది.