తెలంగాణా ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటమిభయం మొదలైనట్లే ఉంది. అందుకనే కాంగ్రెస్ పైన లేనిపోని అబద్ధాలన్నింటినీ ప్రచారం చేస్తోంది. తాజాగా తెలంగాణాలో కర్నాటక రైతులు పర్యటిస్తుండటం, కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం చేయటం అందరికీ తెలిసిందే. రైతులు ఏమని ప్రచారం చేస్తున్నారంటే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలను నమ్మి ఓట్లేసి మోసపోయినట్లు రైతులు చెబుతున్నారు. ఎందుకంటే ఎన్నికల్లో గెలుపుకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలేవి అమలు చేయటంలేదని రైతులు మండిపోతున్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అందుకనే తమకు ఒళ్ళుమండిపోయి కాంగ్రెస్ అబద్ధాలను, తప్పుడు హామీలను ఎండగట్టేందుకు తెలంగాణాలో తిరుగుతున్నట్లు చెప్పారు. దాంతో కాంగ్రెస్ విషయంలో రైతులు చెబుతున్నది నిజమేనా లేకపోతే అబద్ధమా అనే అయోమయం జనాల్లో పెరిగిపోతోంది. అయితే రైతుల చెప్పే విషయాల మీద లోతుగా పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. ఎలాగంటే కాంగ్రెస్ బండారం ఇది అని రైతులు చేస్తున్న ప్రచారమంతా అబద్ధమే అని తేలింది. ఎందుకంటే వాళ్ళెవరు రైతులు కారు.
కర్నాటక నుండి పెయిడ్ ఆర్టిస్టులను బీఆర్ఎస్ తెచ్చి కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నట్లు బయటపడింది. కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై తాము వ్యతిరేకంగా ప్రచారం చేసినా, ఆరోపించినా జనాలు నమ్మరని బహుశా కేసీయార్, కేటీయార్, హరీష్ రావుకు అర్ధమయ్యుంటుంది. అందుకనే కర్నాటక రైతుల వేషంలో కొందరు పెయిడ్ ఆర్టిస్టులను పట్టుకొచ్చి వాళ్ళతోనే కాంగ్రెస్ పై బురద చల్లిస్తోంది. వీళ్ళెంత బురదచల్లించినా ఒకరోజు కాకపోతే మరుసటిరోజైనా వాస్తవం బయటపడకుండానే ఉంటుందా ?
ఇపుడు చెప్పుకున్నట్లుగానే ఈ పెయిడ్ ఆర్టిస్టులే తమకు డబ్బులిచ్చి కర్నాటక నుండి తెలంగాణాకు పట్టుకొచ్చినట్లు స్వయంగా చెప్పటంతో అసలు విషయం బయటపడింది. సోనియాగాంధి ప్రకటించిన సిక్స్ గ్యారెంటీస్, వివిధ వర్గాల కోసం ప్రకటించిన డిక్లరేషన్లు జనాల్లో బాగా సానుకూల చర్చలు జరుగుతున్నట్లు బీఆర్ఎస్ ముఖ్యులకు సమాచారం అందిదట. అందుకనే పనిగట్టుకుని పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారు. దీంతోనే బీఆర్ఎస్ లో ఓటమిభయం పెరిగిపోతోందని అర్ధమవుతోంది.