కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ తో బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఢీ అంటే ఢీ అన్న రీతిలో తలపడుతున్న సంగతి తెలిసిందే. బిజెపి నేతలపై యుద్ధం ప్రకటిస్తున్నానని జాతీయస్థాయిలో పార్టీ పెట్టిన కేసీఆర్….అందుకు తగ్గట్టుగానే ఢిల్లీలో రాజకీయం చేసేందుకు సన్నాహాలు మొదలుబెట్టారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 14వ తేదీన టిఆర్ఎస్ తాత్కాలిక జాతీయ కార్యాలయాన్ని ఢిల్లీలో కేసీఆర్ ప్రారంభించబోతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ దారిలో భారీ సంఖ్యలో టిఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. దేశ్ కీ నేతా కేసీఆర్ అంటూ ఫ్లెక్సీలపై ముద్రించారు. అయితే, టిఆర్ఎస్ జాతీయ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ, హోర్డింగ్లను న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించడం సంచలనం రేపుతోంది. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రధాన రహదారి కావడం, వీఐపీలు తిరిగే ప్రాంతం కావడంతోనే వాటిని తొలగించామని అధికారులు చెబుతున్నారు.
కానీ, టిఆర్ఎస్ పై కక్షతోనే ఈ ఫ్లెక్సీలు తొలగించారని టిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. టిఆర్ఎస్ తాత్కాలిక జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జెడి యువనేత తేజస్వి యాదవ్, రైతు సంఘాల నాయకుడు రాకేష్ టికాయత్ తో పాటు పలువురు హాజరు కాబోతున్న నేపథ్యంలోని ఈ ఫ్లెక్సీలను బిజెపి పెద్దలు కక్షగట్టి తొలగించారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు, రేపు పార్టీ కార్యాలయంలో రాజశ్యామల, నవ చండీ యాగాల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. దీంతో, కేసీఆర్ ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు తెరవక ముందే మోడీ షాకిచ్చినట్లయింది.