హోరాహోరీగా సాగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ కు సరిగ్గా ఐదు రోజులే ఉన్న వేళ.. తెలంగాణ అధికార పార్టీ డౌన్ ఫాల్ మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా నెల క్రితం ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి అస్సలు సంబంధం లేదని ఆ పార్టీకి చెందిన ప్రముఖులు సైతం ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్న మాటలు గులాబీ దళంలోమరింత నిరాశకు గురి చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
సరిగ్గా నెల క్రితం తెలంగాణలో ఎవరి బలం ఎంత అన్న మాటకు ప్రతి పది మందికి ఆరేడుగురు కాంగ్రెస్ గాలి కనిపిస్తున్నప్పటికీ.. గులాబీ పార్టీ గెలుపు విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.
అంతదాకా ఎందుకు ఈ నెల మొదటి వారంలోనూ ఇలాంటి మాటే ప్రతి ఒక్కరి నోట వినిపించింది. చివరకు కాంగ్రెస్ అభ్యర్థుల్లోనూ ఇదే చర్చ జరిగింది. కాంగ్రెస్ గాలి వీస్తుందని చెబుతున్నా.. అది మా వరకు ఉందా? లేదా? అన్న సందేహాన్ని కాంగ్రెస్ అభ్యర్థుల నోటి నుంచి వినిపించేది.అంతదాకా ఎందుకు?.. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలై.. ఫలానా సీటుకు ఫలానా అభ్యర్థి అన్నది తేలినప్పటికీ.. వాతావరణం తమకుసానుకూలంగా ఉన్నప్పటికీ.. వాటి ఫలాలు తాము అందుకునే అవకాశం ఎంతన్న దానిపై అభ్యర్థులు సైతం అయోమయంలో ఉన్నారని చెబుతున్నారు. కానీ.. వారం క్రితం నుంచి మాత్రం వాతావరణం పూర్తిగా మారిందన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి నిఘా వర్గాలు ఇస్తున్న రిపోర్టులోనూ ఇదే విషయం కనిపించటంతో గులాబీ పార్టీలో కొత్త గుబులు పెరిగిందంటున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం నెల క్రితం కూడా 80 స్థానాలు (మజ్లిస్ పార్టీకి కలుపుకొని) పక్కా అని.. వచ్చేది మళ్లీ తమ ప్రభుత్వమేనన్న ధీమా వ్యక్తమయ్యేది. ఈ నెల మొదటి వారం ముగిసే సమయానికి 70-75 సీట్లు ఖాయమన్న మాట కూడా వినిపించేది. కానీ.. గడిచిన మూడు నాలుగు రోజులుగా మాత్రం అందుకు భిన్నమైన మాట వినిపిస్తుండటం గమనార్హం. తాజా లెక్కల ప్రకారం గులాబీ పార్టీకి చెందిన ముఖ్యుల నోటి నుంచి వస్తున్న ప్రైవేటు లెక్కల ప్రకారం 50 సీట్లు దాటటం లేదని చెబుతున్నారు. మరికొందరుఅయితే 40 ఫిగర్ దాటటం లేదని.. మజ్లిస్ కు వచ్చే 7 స్థానాల్లో ఒకట్రెండు దెబ్బ పడుతుందన్న మాట వినిపిస్తోంది. నెలలో ఇంత మార్పా? అన్నదిప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ వాదనలో నిజం ఎంత? అన్నది తేలాలంటే మాత్రం డిసెంబరు 3 వరకు వెయిట్ చేయక తప్పదు.