కేసీఆర్ తొందరలోనే ఢిల్లీలో క్యాంపు వేయబోతున్నట్లు సమాచారం. బహుశా 22వ తేదీన అంటే గురువారం ఢిల్లీకి బయలుదేరే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ అడిగినట్లు కూడా తెలిసింది. అయితే ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదట. పీఎంవో నుండి వచ్చే సమాధానం ఆధారంగా ఢిల్లీ పర్యటన ఉంటుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీయార్ కు వాస్తవ పరిస్ధితి ఏమిటో అర్ధమైందట. అందుకనే ఎన్డీయేలో పార్టనర్ గా చేరాలని అనుకుంటున్నట్లు సమాచారం.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బలోపేతం అవటం నరేంద్రమోడీకి ఎంతవసరమో కేసీయార్ కూ అంతే అవసరం. మూడోసారి ఎన్డీయే అధికారంలోకి రావటంలో ఎవరికీ అనుమానం లేదు. కాకపోతే మూడోసారి ప్రధానమంత్రి అవ్వటం మాత్రమే మోడీ టార్గెట్ కాదు. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయటమే అసలైన టార్గెట్. కాంగ్రెస్ ను వ్యక్తిగతంగాను, ఇండియా కూటమిని అత్యంత బలహీనం చేయటమే మోడీ ఆలోచన. అందుకు వీలుగానే ఇండియా కూటమిలోని పార్టీలను లాగేసుకుంటున్నారు.
కూటమిలో కీలకపాత్ర పోషించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ఎన్డీయేలోకి లాగేసుకోవటం ఇందులో భాగమే. ఏపీలో టీడీపీని ఎన్డీయేలో చేర్చుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో బలమైన ప్రతిపక్షాలను ఎన్డీయే కూటమిలోకి లాగేసుకోవటం ద్వారా కాంగ్రెస్ లేదా ఇండియా కూటమిని దెబ్బతీయాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణాలో కేసీయార్ ను చేర్చుకునే అవకాశం ఉందంటున్నారు. ఇదే సమయంలో తెలంగాణా బీఆర్ఎస్ బలోపేతం అవ్వాలంటే కేంద్రంలో బలమైన అండ చాలా అవసరమని కేసీయార్ కూడా గుర్తించారట.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మోడీ, కేసీఆర్ కు ఉమ్మడి ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీ. అందుకనే శతృవుకు శతృవు మిత్రుడన్న రాజనీత ఆధారంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్ఎస్ కలిసే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ విషయాలు మాట్లాడేందుకే మోడీ అపాయిట్మెంట్ కావాలని కేసీయార్ అడిగారని తెలిసింది. ఎవరు ఎవరితో మాట్లాడినా, ముందు ఎవరు చొరవ తీసుకున్నా రాజకీయాల్లో లబ్దిపొందటమే ఏకైక లక్ష్యంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.