రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరు, శాశ్వత మిత్రులుండరనే నానుడి చాలా పాపులర్. ఇపుడది తొందరలోనే తెలంగాణాలో మరోసారి నిజమయ్యేట్లుంది. రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపే అవకాశాలున్నట్లు సంకేతాలు కనబడుతున్నాయి. కాకపోతే రెండు పార్టీల మధ్య పొత్తు పార్లమెంటు ఎన్నికలకు ముందా తర్వాత అన్నది మాత్రమే తేలాలని పొలిటికల్ సర్కిళ్ళల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీకి కామన్ శత్రువైన కాంగ్రెస్ ను ఎదుర్కోవాలంటే విడివిడిగా పోరాటం చేస్తే సాధ్యం కాదని రెండుపార్టీల నేతలకు అర్ధమైందట.
తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావటాన్ని రెండుపార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా నరేంద్రమోడీ అయితే చాలా మండిపోతున్నారట. దేశంలో ఎక్కడా కాంగ్రెస్ అన్నది అధికారంలోకి లేకుండా చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలోనే ముందు కర్నాటకలోను తర్వాత తెలంగాణాలో అధికారంలోకి రావటాన్ని మోడీ తట్టుకోలేకపోతున్నారట. దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవటంలో భాగంగానే కేసీయార్ వైపు నుండి పొత్తు సంకేతాలు వెళ్ళాయని సమాచారం. రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దక్షిణాదిలో కొత్త మిత్రుల కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది.
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో పొత్తు చర్చలు జరపటం ఇందులో భాగమేనట. కాబట్టి అదే పద్దతిలో తెలంగాణాలో కేసీయార్ తో కూడా పొత్తు పెట్టుకోవటంలో తప్పేమీలేదని మోడి అనుకుంటున్నట్లు పార్టీవర్గాల సమాచారం. శతృవుకి శతృవు మిత్రుడన్నట్లే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలపబోతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. ఎన్డీయేలో చేరితే మంత్రివర్గంలో బీఆర్ఎస్ కు చోటు దక్కటం ఖాయం. కేంద్ర మంత్రి హోదాలో రాష్ట్రంలో రేవంత్ దూడుకుడు పగ్గాలు వేయచ్చని కేసీయార్ అనుకుంటున్నారట.
ఇపుడు కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నా అంత ఇంపాక్ట్ కనబడటంలేదని బీజేపీ పెద్దలు కూడా ఆలోచిస్తున్నారట. కిషన్ కు తోడు బీఆర్ఎస్ తరపున కూడా కేంద్రమంత్రిగా ఉంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపించవచ్చని అనుకుంటున్నారట. తెలంగాణాలో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవటం బీజేపీకి ఎంత అవసరమో, బీఆర్ఎస్ కు కూడా బీజేపీతో పొత్తు అంతే అవసరం. లేకపోతే రెండుపార్టీలను రేవంత్ ఉతికి ఆరేయటం ఖాయమని ఇప్పటికే అర్ధమైపోయింది. అందుకనే ఈ భయంతోనే రెండుపార్టీలు తొందరలోనే పొత్తులు పెట్టుకోబోతున్నట్లు బాగా ప్రచారం పెరిగిపోతోంది.