ఏపీలో రాజకీయం అనూహ్య రీతిలో మారుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ కావటం.. కీలక ప్రకటన ఈ రోజు (గురువారం) వెల్లడి కానున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇంతకూ ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది? దీనికి కారణం ఏమిటి? షర్మిల ఫ్యామిలీ వాదన ఏమిటి? లాంటి అంశాలు బయటకు వచ్చింది లేదు. అలా జరిగిందట.. ఇలా జరిగిందట లాంటి మాటలే తప్పించి.. షర్మిల కుటుంబ సభ్యులు నేరుగా ఎవరితోనూ మాట్లాడింది లేదు. ఒకవేళ మాట్లాడినా.. నాకు షర్మిల ఫ్యామిలీ ఇలా చెప్పారు? అని చెప్పింది లేదు. ఇందుకు భిన్నంగా టీడీపీ నేత.. కడప జిల్లాకు చెందిన బీటెక్ రవి మాత్రం షర్మిల భర్త బ్రదర్ అనిల్ తనతో మాట్లాడారంటూ పలు అంశాల్ని ప్రస్తావించినట్లుగా వివరాలు బయటకు వచ్చాయి.
బుధవారం వీరిద్దరు కడప ఎయిర్ పోర్టులో అనుకోకుండాబ్రదర్ అనిల్.. బీటెక్ రవి.. దేవగుడి నారాయణ రెడ్డిలు కలవటం తెలిసిందే. ఈ సందర్భంగా బ్రదర్ అనిల్ బీటెక్ రవితో మాట్లాడిన పలు అంశాల్ని ప్రస్తావించటం బయటకువచ్చాయి. ఈ వివరాల్ని బీటెక్ రవినే వెల్లడించారా? లేదంటే.. వారి వర్గాల నుంచి మీడియాకు సమాచారం అందిందా? అన్నది ప్రశ్న. మొత్తంగా బీటెక్ రవితో బ్రదర్ అనిల్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతున్న అంశాల్ని చూస్తే..
– జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే షర్మిలను .. నన్ను దూరం పెడుతూ వచ్చారు. ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని షర్మిలకు ఆసక్తే లేదు.
– జగన్ కారణంగానే విధి లేని పరిస్థితులు కల్పించటంతోనే ఏపీ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది.
– ‘మీ డిబేట్లు టీవీల్లో చూస్తుంటా. ముక్కుసూటిగా మాట్లాడతారు’ అని బీటెక్ రవితో బ్రదర్ అనిల్ వ్యాఖ్యానించారు.
– ఢిల్లీలో షర్మిలతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నాం.
– పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారా? అన్న బీటెక్ రవి ప్రశ్నకు.. అదంతా రాహుల్ గాంధీ ఇష్టం. పీసీసీ ఇస్తారా? సీడబ్ల్యూసీలో సభ్యత్వం ఇస్తారా? అన్నది చర్చకు రాలేదు.
– కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా మాకు ఫర్లేదు.
– ‘సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడ ఉన్నా.. కడప రాజకీయాల్ని దివంగత వివేకానందరెడ్డే చూసేవారు.. ఆయన్ను అంత దారుణంగా హత్య చేయటం బాధాకరం’ అనిల్ వ్యాఖ్యానించారు.
– వివేకానంద హత్య కేసులో తమను ఇరికించే ప్రయత్నం చేసి.. ఇబ్బందులకు గురి చేశారని బీటెక్ రవి.. నారాయణ రెడ్డి బ్రదర్ అనిల్ కు చెప్పారంటున్నారు.
– ఒక మీడియా సంస్థ బీటెక్ రవిని సంప్రదించగా.. తాను బ్రదర్ అనిల్ తో మాట్లాడానని.. ఆయన తమ ఊరి అల్లుడని.. అందుకే కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పానని.. కాంగ్రెస్ లో చేరుతున్నందున ఆల్ ది బెస్టు చెప్పినట్లుగా పేర్కొనటం గమనార్హం.