సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పేరు కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంపై బ్రదర్ అనిల్ కుమార్ విమర్శలు గుప్పిస్తోన్న వైనం హాట్ టాపిక్ గా మారింది. జగన్ పాలనపై క్రిస్టియన్, బీసీ, ఎస్సీ, ఎస్టీలు సంతోషంగా లేరని, దీంతో, ఆయా సంఘాల ప్రతినిధులతో తాను భేటీలు నిర్వహిస్తున్నానని బ్రదర్ అనిల్ చెబుతున్నారు.
ఇక, ఏపీకి బీసీ సీఎం కావాలని ఏకంగా తన బావ, సీఎం జగన్ పదవికే బ్రదర్ అనిల్ ఎసరు పెట్టేలా కామెంట్లు చేశారు. దీంతో,బ్రదర్ అనిల్ కు రాజకీయాలతో సంబంధం లేదని, రాజకీయ నాయకుడిగా అవతారమెత్తాలని బ్రదర్ అనిల్ కు ఉంటే…తెలంగాణలో రాజకీయ పార్టీ పనులు చూసుకోవాలని చాలామంది క్రిస్టియన్ సంఘాల నేతలు సలహా ఇచ్చారు. ఇక, గుంటూరులోని ఆంధ్రా ఎవాంజిలికల్ లూథరన్ చర్చి (ఏఈఎల్సీ)లో బ్రదర్ అనిల్ ప్రమేయం పెరిగిందంటూ ఆ సంఘం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేయడం కూడా చర్చనీయాంశమైంది.
ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై మరోసారి బ్రదర్ అనిల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖపట్టణం జిల్లా భీమిలి మండలంలోని ‘క్రైస్ట్ కేర్ అండ్ క్యూర్ మినిస్ట్రీస్’లో నిన్న నిర్వహించిన ప్రార్థన కూడికలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాకుండా పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారని బ్రదర్ అనిల్ అన్నారు. తమ స్వార్థం కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలపై ఆధారపడొద్దని, దేవుడి పథకాలు వేరేగా ఉంటాయని పరోక్షంగా జగన్ ప్రవేశ పెట్టిన పథకాలను ఆయన విమర్శించారు. అయితే, ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేసినా…ఎక్కడా జగన్, ముఖ్యమంత్రి, వైసీపీ అని ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం.