ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం సెంటరాఫ్ ఎట్రాక్షన్గా ఉన్న కాంగ్రెస్ నాయకురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల భర్త, ప్రముఖ సువార్తీకుడు.. బ్రదర్ అనిల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాపాలు చేసిన వారిని.. అన్యాయాలు చేసిన వారిని తొక్కిపడేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం ప్రార్థనలకే పరిమితం అయితే.. దేవుడికే వదిలేస్తే.. కుదరదని.. కాబట్టి.. పాపాలు చేసిన వ్యక్తులను తొక్కిపడేయాలని పిలుపునిచ్చారు.
అయితే.. బ్రదర్ అనిల్ ఎక్కడా రాజకీయ పరమైన వ్యాఖ్యలుచేయలేదు. కానీ, ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రంఫక్తు రాజకీయాలను ఉద్దేశించే చేశారని, అది కూడా వైసీపీ అధినేత, తన బావ జగన్ను ఉద్దేశించే చేశారని అంటున్నారు పరిశీలకులు. దీంతో ఇది రాజకీయ దుమారానికి దారితీసింది. తాజాగా కడప నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో ప్రైవేటు ప్రార్థనా కూటమికి హాజరైన బ్రదర్ అనిల్.. స్థానికంగా ఉన్న వారికి ఈ బోధన చేయడం గమనార్హం.
అనిల్ వ్యాఖ్యలు విన్నవారు.. ఇటీవల కాలంలో కడపలో జరుగుతున్న పరిణామాలపైనే అనిల్ వ్యాఖ్యా నించారని చెబుతున్నారు. షర్మిల, సునీతలు ఇద్దరూ రోడ్డెక్కడం.. తమకు అన్యాయం చేస్తున్నారని సీఎం జగన్పై విమర్శలు గుప్పించడం తెలిసిందే. అంతేకాదు.. ప్రస్తుతం సునీత గడపగడపకు తిరుగుతూ తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బ్రదర్ అనిల్ సైతం.. తొక్కిపడేయాలని.. అన్యాయంపై పోటెత్తాలని పిలుపునివ్వడం పూర్తిగా జగన్ను ఉద్దేశించే అని పరిశీలకులు భావిస్తున్నారు.