వందేళ్ల క్రితం భారత్ లో చోటు చేసుకున్న జలియన్ వాలాబాగ్ దురంతం మానవ చరిత్రలో చెరిగిపోని ఒక మరకగా చెప్పాలి. బ్రిటిష్ సామ్రాజ్యానికి మాయని మచ్చగా మారిన ఈ ఉదంతం 1919 ఏప్రిల్ 13న జరిగింది. ఈ దారుణ ఘటన గురించి తాజాగా బ్రిటన్ ఎంపీ ఒకరు యూకే పార్లమెంట్ లో ప్రస్తావిస్తూ.. ఇప్పటికైనా భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు.
ఏప్రిల్ 13కు ఎంతో దూరం లేని నేపథ్యంలో నాటి గవర్నర్ జనరల్ డయ్యర్ దురాగతానికి వందలాది మంది ప్రజల చనిపోవటం.. పెద్ద ఎత్తున గాయపడటం తెలిసిందే. ఈ ఉదంతాన్ని గుర్తు చేసిన విపక్ష కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్ మన్.. భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెబుదామన్న ప్రతిపాదన చేశారు.
ఈ మారణహోమంలో 1500 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 1200 మంది గాయపడ్డారు.
మారణహోమం జరిగిన ప్రాంగణం శవాల దిబ్బగా మారింది. ఇంతకూ అప్పట్లో ఏం జరిగిందంటే 1919లో రౌలత్ చట్ట వ్యతిరేక సత్యాగ్రహ యోధులను కఠినంగా అణిచివేయాలని నాటి బ్రిటన్ ప్రభుత్వం నిశ్చయించింది. 1919లో పంజాబ్ లోని ప్రసిద్ధ నాయకులు డాక్టర్ సత్యపాల్.. సైఫుద్దీన్ కిచ్లూలను ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ వార్తతో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురై.. నిరసనలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం అమ్రత్ సర్ లో మార్షల్ లా విధించింది. నగరంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చే బాధ్యతను జనరల్ డయ్యర్ కు అప్పజెప్పింది. ఈ క్రమంలో ఏప్రిల్ 13న వైశాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్రత్ సర్ లోని వాలాబాగ్ మైదానంలో నిరసన సభకు.. అలాగే వైశాఖీ వేడుకుల కోసం గ్రామీణులు.. పట్టణ వాసులు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ కు అనుమతి లేదంటూ నిషేధాజ్క్షలు జారీ చేసిన జనరల్ డయ్యర్.. తన సాయుధ దళంతో ఎలాంటి హెచ్చరికలు లేకుండా తూటాల వర్షాన్ని కురిపించారు. తూటాలు అయ్యే వరకు కాల్పులు అపొద్దని ఆదేశించాడు. దీంతో.. ఆ మైదానం శవాలదిబ్బగా మారింది.
ఇదే అంశాన్ని ప్రస్తావించిన బ్రిటన్ ఎంపీ బ్లాక్.. ‘‘త్వరలో ఏప్రిల్ 13 రాబోతోంది.దాని కంటే ముందు మన ప్రస్తుత ప్రభుత్వం ఒక ప్రకటన ఇవ్వగలదా? చేసిన తప్పును అంగీకరించి.. భారత ప్రజలకు బ్రిటన్ అధికారికంగా క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. మరేం జరుగుతుందో చూడాలి.