హాలీవుడ్ తరహాలో ఇండియాలోనూ ఫ్రాంఛైజీ సినిమాల ఊపు పెరుగుతోంది. కొందరు ఒక సినిమాగా మొదలుపెట్టి అది సక్సెస్ అయ్యాక దాన్ని సిరీస్‌గా మారిస్తే, ఇంకొందరేమో ఆరంభం నుంచే ఫ్రాంఛైజీ సినిమాలను ప్రకటిస్తున్నారు. గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలై ఓ మోస్తరు ఫలితాన్ని అందుకున్న బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ను మూడు భాగాలుగా తీయనున్నట్లు ముందే ప్రకటించారు.
‘శివ’ పాత్ర ప్రధానంగా తొలి భాగాన్ని రిలీజ్ చేశారు. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. గ్రాఫిక్స్ వరకు నచ్చడం, పబ్లిసిటీ బాగా చేయడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు ఫలితాన్ని అందుకుంది. ఐతే మేకర్స్ కోరుకున్న స్థాయిలో అయితే సినిమా విజయవంతం కాలేదు. బయ్యర్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టాలు చవిచూశారు. ఈ నేపథ్యంలో 2, 3 భాగాల మీద కొంత సందేహాలు నెలకొన్నాయి.
కానీ ఆ సందేహాలకు తెరదించుతూ దర్శకుడు అయాన్ ముఖర్జీ ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్-2, 3 రిలీజ్ గురించి ప్రకటన కూడా చేసేశాడు. బ్రహ్మాస్త్ర-2ను 2026లో, బ్రహ్మాస్త్ర-3ని 2027లో విడుదల చేయబోతున్నట్లు అయాన్ ప్రకటించాడు. నిజానికి ముందు అనుకున్న ప్రకారం రెండో భాగం 2025లోనే విడుదల కావాల్సింది. ఐతే బ్రహ్మాస్త్ర-1 ఆశించిన ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్‌ను అనుసరించి మరింత మెరుగ్గా స్క్రిప్టు తీర్చిదిద్దుకోవడానికి సమయం తీసుకోనున్నట్లు అయాన్ తెలిపాడు.
అందుకే రెండో భాగం రిలీజ్ ఆలస్యం అవుతుందన్నాడు. దీంతో పాటే మూడో భాగాన్ని కూడా ఒకేసారి చిత్రీకరిస్తామని.. ఇంకో ఏడాది లోపే ఈ చిత్రం కూడా విడుదలవుతుందని అయాన్ తెలిపాడు. బ్రహ్మాస్త్ర-1లో రణబీర్ హీరో కాగా.. సినిమాలో అతడి తండ్రి పాత్ర దేవ్ ఆధారంగా రెండో భాగం నడుస్తుంది. ఈ పాత్రకు ఒక పెద్ద స్టార్ హీరోనే ఎంచుకునే అవకాశముంది. బహుశా అది హృతిక్ రోషన్ కావచ్చని అంటున్నారు.